కాలువల్లోని మట్టిని తీసి నీటిని అందించాలని డమాండ్
farmer | నర్మెట్ట, మార్చి 29: పంటలు ఎండుతున్నాయి.. రిజర్వాయర్లో నీటిని కాలువల ద్వారా మాకు అందించాలని అధికారులను వేడుకున్నా.. పట్టించుకోవడంలేదని మండలంలోని వెల్దండ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు. వెల్దండ రిజర్వాయర్ లోని నీటిని తూము వరకు తరలించేందుకు రైతులు జేసీబీని శనివారం తీసుకుని వచ్చారు.
విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు రైతులకు ఫోన్ చేసి కేసులునమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఎండిపోతున్న పంటలను చూసైనా తమను కనుకరించి వీటిని విడుదల చేయాలని రైతులు అధికారులను వేడుకున్నారు. అయినా సంబంధిత అధికారి వినకపోవడంతో రైతులు రిజర్వాయర్లో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ తమ పంటలు ఎండుతున్నాయని అధికారులు పట్టించుకోవడంలేదని రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయడంలో అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఏనాడు పంటలు ఎండిపోలేదని ఈ సారే ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటలకు నీరు ఇవ్వకపోతే చావే శరణ్యమని అన్నారు.
ఇప్పటికే పంటలు సగం ఎండిపోయాయి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. పంటలకు నీటిని అందించకపోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు కళ్యాణం మల్లేశం, నాగపురి చంద్రయ్య, రావుల సోము రెడ్డి, కాసర్ల శ్రీరాములు, ఎడమల అంజి రెడ్డి, నాగపురి సత్తయ్య, సిర్ర మల్లారెడ్డి, ఆగమాల ప్రేమ్ కుమార్, పంతెంగి రామయ్య, పంతెంగి కుమార్, కళ్యాణం సత్యనారాయణ, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.