ఏటూరునాగారం, జూలై 7 : ఏటూరునాగారం, మంగపేట, వాజేడు, వెంకటాపురం మండలాల్లో గుడుంబా, మద్యం రవాణాలో పట్టుబడిన వాహనాలతో ఎక్సైజ్ కార్యాలయం ఆవరణ నిండిపోయింది. కొన్ని నెలలుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, టాటా మ్యాజిక్లను కార్యాలయానికి తరలించారు. అయితే ఈ వాహనాలపై కేసులు నమోదు చేసిన అధికారులు గడువు ముగిసిన తర్వాత వాటిని వేలం వేసి అమ్ముతుంటారు. వాటిని ఆర్టీఏ అధికారులు పరిశీలించి, ధర నిర్ణయించాల్సి ఉంటుంది. కొద్ది కాలంగా ఎక్సైజ్ అధికారులు వేలం పాటలు నిర్వహించకపోవడంతో సుమారు 50 వరకు ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాలు 20కి పైగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కార్యాలయం ఆవరణ తక్కువగా ఉండడంతో ఇరుకుగా మారింది. వాహనాలు పట్టుబడితే వాటిని ఉంచేందుకు స్థలం కూడా లేకుండా ఉంది. ఆవరణలో ఉన్న వాహనాలను కాపాడేందుకు ఎక్సైజ్ సిబ్బంది తంటాలు పడాల్సి వస్తున్నట్లు సమాచారం.