భీమదేవరపల్లి, జనవరి 10 : కోరిన కోర్కెలు తీర్చే కొత్తకొండ వీరభద్రస్వామివారి కల్యాణం కొత్తకొండలో మంగళవారం రాత్రి కనులపండువగా జరిగింది. మకరసంక్రాంతిని పురస్కరించుకొని జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాలు వీరభద్రస్వామి కల్యాణంతో ప్రారంభమయ్యాయి. మొదటగా ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆలయ అర్చకులు భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉత్సవమూర్తులను పల్లకీలో తీసుకుని వచ్చి నిత్య కల్యాణమండపంలో అందంగా అలంకరించారు. పట్టువస్ర్తాలు, తలంబ్రాలను హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్, జడ్పీ చైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మాడిశెట్టి కుమారస్వామి, ఎంపీపీ జక్కుల అనితారమేశ్, జడ్పీటీసీ వంగ రవి, ఈవో కిషన్‌రావు కల్యాణ మహోత్సవానికి తీసుకుని వచ్చారు.
మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అంగరంగవైభవంగా వేదపండితులు స్వామివారి కల్యాణం జరిపించారు. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు కల్యాణమహోత్సవాన్ని తిలకించారు. అంతకుముందు వీరభద్రస్వామి కల్యాణ మండపాన్ని ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో వేలేరు జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, సర్పంచ్ దూడల ప్రమీల, ఎంపీటీసీ యాటపోలు రాజమణి, ఆలయ ఉపప్రధాన అర్చకుడు రాజయ్య, అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, సదానందం, శ్రీకాంత్, వినయ్‌శర్మ, రమేశ్, శ్రావణ్, గురుప్రసాద్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు మార్పాటి మహేందర్‌రెడ్డి, ఆర్ వెంకటరెడ్డి, చంద్రశేఖర్గుప్త, ఆలయ ధర్మకర్తలు ఎల్తూరి ప్రభాకర్, భూక్య తులస్య, నాగపురి సతీశ్, మఠం శ్రీశైలం, ఓదెలు, ఆలయ సిబ్బంది మల్లారెడ్డి, సంజీవరావు, రామకృష్ణారావు, సందీప్, శ్రీధర్, రాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.