వరంగల్ చౌరస్తా: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మల గీతాంబా పిలుపునిచ్చారు. గురువారం ఉదయం వరంగల్ లోని దయానంద్ కాలనీలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ కుటుంబ సభ్యుల మధ్య గాని, ఇద్దరు వ్యక్తుల మధ్య గాని వచ్చే వివిధ రకాల తగాదాలను కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
ఈ మీడియేషన్ విధానంలో శిక్షణ పొందిన మధ్యవర్తులు ఆయా కమ్యూనిటీలకు సంబంధించిన పెద్దవారై ఉంటారు కాబట్టి వారి అనుభవంతో వివాదాలను పరిష్కరిస్తారని ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ విధంగా కమ్యూనిటీ మీడియేషన్ లో పరిష్కారమైన వివాదాలను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా లోక్ అదాలత్ అవార్డు జారీ చేయిస్తామన్నారు ఈ అవార్డుకి అప్పీలు ఉండదని ఇది అంతిమమైన తీర్పు అని అన్నారు. కమ్యూనిటీ మీడియేషన్ లో వివాదాన్ని తీసుకురావడానికి కానీ పరిష్కరించుకోవటానికి కానీ ఎటువంటి ఖర్చు ఉండదని, సేవలు అన్ని ఉచితమేనని న్యాయమూర్తి తెలిపారు.
వివాదంలో ఉన్న ఇరుపక్షాల వారితో సుహృద్భావ వాతావరణంలో మాట్లాడి వారి అంగీకారంతోనే రాజీకి ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఎం సాయికుమార్, దయానంద్ కాలనీ మధ్యవర్తిత్వ కేంద్ర మెడియేటర్ కొండ్రెడ్డి మల్లారెడ్డి, ఏ.రాజేంద్ర ప్రసాద్, జి.జగ్గారావు, ఎస్.సత్యనారాయణ మరియు ఆయా ప్రాంతాల కమ్యూనిటీ మీడియేటర్లు, కాలనీ వాసులు మీసాల ప్రకాష్, వెంకటేశ్వర్లు, రవికుమార్, దీనా అశోక్, వసుందర, షాకీరా, అరుణ, సుభాషిణి , రాణి వెంకటేశ్వర్లు, రాజేష్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.