వరంగల్ చౌరస్తా : పది సంవత్సరాల పాలనపై ఉన్న వ్యతిరేకతను తొలగించడం కోసం బీజేపీ పాలకులు అపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తూ ప్రజల దృష్టిని మరలుస్తున్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి అడ్డస్తున్నారని ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను, ఆదివాసీలను, గిరుజనులను ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేసి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నరని ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ చంద్రశేఖర్ అన్నారు.
గురువారం వెంకటరమణ జంక్షన్‌లోని ఎంసీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతన రాష్ట్ర కార్యదర్శిగా వర్ల చంద్రశేఖర్‌ను నూతన రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చి, భయబ్రాంతులకు గురిచేసి ప్రశ్నించే హక్కులను లాగేసుకోవాలని చూస్తున్నదని ఆరోపించారు. దీనిని సహిస్తూపోతే ఏజెన్సీ ప్రాంతాలలో జరుగుతున్న మారణకాండ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సైతం పాకుతుందని హెచ్చరించారు.
అణచివేత దోరణిని అడ్డుకునే శక్తి కేవలం కమ్యూనిస్టులకు మాత్రమే ఉందని అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొని దేశ ప్రజాంద్యమాలను ముందుకు తీసుకువెళ్ళడానికి కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అన్నారు. వ్యవసాయరంగాన్ని రక్షించుకోవడానికి నకిలీ విత్తనాల అమ్మకాలు చేపట్టిన సంస్థ లేదా వ్యక్తి ఆస్తులను జప్తు చేసుకోవడంతో పాటుగా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోనే నూతన విత్తన చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు లింగంపల్లి శ్రీనివాసరెడ్డి, మోర్తాల చందర్రావు, సింగతి సాంబయ్య, పానుగంటి నరసయ్య, మాదం తిరుపతి, మాడిశెట్టి అరుణ్ కుమార్, తాటికొండ రవి, సంద గణేష్, మాలోతు రాజేష్ నాయక్, పెద్ది సూరి, నాచారం శేఖర్, బాషిపాక బాబు, తదితరులు పాల్గొన్నారు.