మడికొండ, అక్టోబర్ 25: గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ పరిధిలోని భట్టుపల్లి శివారులో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు వర్ధన్నపేట నియోజవర్గంలోని సుమారు లక్ష మంది హాజరు కానున్నట్లు ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సబ్బండ వర్గాల కోసం అభివృద్ధితోపాటు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు హాజరు కానున్న నేపథ్యంలో ప్రజలు, లబ్ధిదారులు, యువతీ యువకులు, పార్టీ శ్రేణులు తరలివస్తున్నట్లు చెప్పారు.
పార్కింగ్ పనులు పూర్తిసభాస్థలానికి రెండు దికుల పారింగ్ ప్రదేశాలు, హెలిప్యాడ్ పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే అరూరి వెల్లడించారు. ఎకడ కూడా అవాంతరాలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పదేళ్లలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధిచేశానని, గతంలో భారీ మెజారిటీ ఇచ్చిన కార్యకర్తలు, ప్రజలకు ఈ సందర్భంగా అరూరి ధన్యవాదాలు తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, తాగు, సాగునీటి కష్టాలను సీఎం కేసీఆర్ తీర్చారన్నారు. ప్రతిపక్ష నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయని, నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడినే ప్రజలు నమ్ముతారని హితవు పలికారు. కరోనా కష్టకాలంలో, వరదల సమయంలో అన్ని రకాలుగా ప్రజలను ఆదుకున్న తనను మరోసారి ఆశీర్వదిస్తారనే ధీమాను వ్యక్తం చేశారు. సమావేశంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్రావు, నాయకులు కర్ర హరీశ్‌రెడ్డి, పోలెపల్లి రామ్మూర్తి పాల్గొన్నారు.