కేసముద్రం, జూలై 6: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఎద్దును ఢీకొట్టింది. దీంతో ఇంజిన్ ముందు భాగం స్పల్పంగా దెబ్బతినగా కొంత భాగం ఊడిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎద్దు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో వస్తున్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొంది.
ఎద్దు అక్కడికక్కడే మృతిచెందగా, ఇంజిన్ ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో రైలు సుమారు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఆర్పీఎఫ్, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఎద్దు మృతదేహాన్ని తొలగించి లైన్ క్లియర్ చేశారు. దీంతో రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు.