నర్సంపేట, ఏప్రిల్ 15 : నర్సంపేటలో ప్రభుత్వ భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వీటిని సంబంధిత మున్సిపల్, రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. నర్సంపేట నుంచి నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారిలో కాకతీయనగర్‌కు సమీపంలో సర్వే నంబర్ 601లో ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఆనుకొని ఉన్న కొంత అసైన్డ్ భూమిని ఎలాంటి అనుమతులు లేకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్ చేశారు.
ఈ వెంచర్‌కు వేళ్లేందుకు దారి లేకపోవడంతో ప్రధాన రహదారి పక్కనే ఉన్న వరద కాల్వను రియల్టర్లు ధ్వంసం చేశారు. ఇందులో పెద్ద మోరీని నిర్మించి, దానిపై మొరం పోసి వెంచర్‌కు దారిగా వినియోగిస్తున్నారు. గడిచిన ఏడాదిన్నరలో మూడుసార్లు ఇలాగే పైప్లైన్లు వేస్తే వాటిని అధికారులు తొలగించినప్పటికీ రియల్టర్లలో ఎలాంటి మార్పు రాలేదు.
అధికారులు వారిని హెచ్చరించినా పెడచెవిన పెడుతున్నారు. పైగా అసైన్డ్ భూమిలో వెంచర్ కోసం వేసిన హద్దు రాళ్లను సైతం మున్సిపల్ అధికారులు తొలగించారు. అయినప్పటికీ వెంచర్‌లోని ప్లాట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని కొనుగోలు చేసిన వారు రానున్న రోజుల్లో ఇబ్బందులు పడతారని స్థానికులు అంటున్నారు. పైగా వరద కాల్వను ఆక్రమించడంతో వానకాలంలో నాలాలు, వాగులు ఉప్పొంగి కాలనీలు, పంట పొలాలు నీటమునిగే అవకాశాలున్నాయంటున్నారు.
మా దృష్టికి వచ్చింది
నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిలో సర్వే నంబర్ 601లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి మోరీలు వేశారన్న విషయం మా దృష్టి కి వచ్చింది. ప్రభుత్వ భూమిలో ఎలాం టి నిర్మాణాలు చేపట్టవద్దు. గతంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను హెచ్చరించారు. మళ్లీ భూమిని పరిశీలించి ఆక్రమణదారులపై తగిన చర్యలు తీసుకుంటాం. – రాజేశ్, తహసీల్దార్, నర్సంపేట