కొత్తగూడ, జూలై 14 : కొత్తగూడ, జూలై 14: అటు కాలం కలిసిరాక.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించక.. రైతులు అరిగోస పడుతున్నారు. వానలు పడక మొలకెత్తిన పంటలు ఒకవైపు ఎండిపోతుండగా.. అదునుకు వేయాల్సిన యూరియా దొరక్క అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారు. పంటలకు నీరు పెట్టాలో.. ఎరువుల కోసం సొసైటీల వద్ద పడిగాపులు పడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. చివరకు పొద్దంతా నిల్చున్నా యూరియా రెండు బస్తాలే ఇస్తుండడంతో నిరాశ చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనగా.. మంత్రి సీతక్క ఇలాకాలోనూ అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి సొసైటీకి వాహనాలు కిరాయికి మాట్లాడుకొని ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకే రైతులు చేరుకొని ఆధార్‌కార్డులను వరుసలో ఉంచారు.
పొద్దంతా ఎండను సైతం లెక్కచేయక బారులుదీరారు. కొందరు కార్డుల పక్కనే కూర్చోగా, మరికొందరు ఎండ తీవ్రతను తాళలేక పక్కనే ఉన్న చెట్లు, ట్రాక్టర్ ట్రాలీల కింద సేదదీరారు. ప్రభుత్వం ఒక పక్క ఎరువుల కొరత లేదని చెబుతున్నప్పటికీ అంతటా ఇదే దుస్థితి చోటు చేసుకుంటున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొగుళ్లపల్లి సొసైటీకి సోమవారం 888 బస్తాల యూరియా రాగా, ఎండలో పొద్దంతా పడిగాపులు పడినా తమకు రెండు బస్తాలే ఇచ్చారని కొత్తగూడ మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగుళ్లపల్లిలో ఉన్న ఒకే సొసైటీ కొత్తగూడ, గంగారం మండలాల్లోని 69 గ్రామాలకు దిక్కుగా ఉందని, ఇక్కడికి ఎరువులు వచ్చా యా? లేదా? అనేది తమకు తెల్వడం లేదని చెబుతున్నారు.
ఎరువుల కోసం తిరగాలో, ఎండిపోతున్న పంటలకు నీళ్లు పెట్టుకోవాలో అర్థంకాని పరిస్థితి నెలకొందని వాపోయారు. గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువుల బస్తాలు అందాయని రైతులు తెలిపారు. పోనీ ప్రైవేట్ వ్యాపారుల వద్ద కొనుగోలు చేద్దామంటే ఒక్కో బస్తాను రూ. 450 పైచిలుకుకు విక్రయిస్తున్నారని, వాటికి పురుగు మందు లు లింకు పెడుతున్నారని మండిపడుతున్నారు. అయినా కొనుగోలు చేసేందుకు తాము సిద్ధపడుతున్నా వారు కూడా బస్తాలు రావడంలేదని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు. కొత్తగూడ మండల రైతులకు ఆధార్‌కార్డుకు రెండు, గంగారం రైతులకు మూడు నుంచి నాలుగు బస్తాలు ఇస్తున్నామని సిబ్బంది చెబుతున్నారు.
రైతులకు విరివిరిగా యూరియా అందేలా ప్రభుత్వం చర్యలు చే పట్టాలి. కొరత ఉంటే ఎరువుల కోసమే రా వాల్సి వస్తున్నది. దీంతో సాగు పనులు చేసుకోలేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. గత్యంతరం లేక కొందరు యూరియా కోసం వారి పిల్లలు, భార్యలను పంపిస్తున్నారు. అటు ఎండలు మండుతుండడంతో నార్లకు నీళ్లు పెట్టాలా? ఎరువుల కోసం బారులు తీరాలా? అనేది అర్ధం కావడం లేదు. తక్షణ మే ప్రభుత్వం స్పందించి యూరియా కొరత లేకుండా చూడాలి.
– సువర్ణపాక సమ్మయ్య, రైతు, దుబ్బగూడెం