శాయంపేట/హనుమకొండ సబర్బన్, మే 17 : అకాల వర్షాలతో ధాన్యం రైతులు ఆగమవుతున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. భీమదేవరపల్లి 4.0 మిల్లిమీటర్లు, వేలేరు 6.0, ఎల్కతుర్తి 5.0, కమలాపూర్ 6.0, హసన్పర్తి 2.0, ధర్మసాగర్ 24.0, కాజీపేట 4.0, హనుమకొండ 1.0, ఐనవోలు 37.0, పరకాల 35.0, దామెర 12.0, అత్మకూరు 39.0, శాయంపేట 21.0, నడికూడ 7.0మి.మీల వర్షం కురువగా జిల్లా వ్యాప్తంగా 14.0గా నమోదైనట్లు శాఖాధికారులు వెల్లడించారు. కాగా, కొద్ది రోజులుగా వర్షాలు పడుతూ ఉండడంతో శాంయంపేట మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దవుతోంది.
ధాన్యాన్ని కాపాడేందుకు రైతులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అయితే, రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చినప్పటికీ రోజుల తరబడి కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వర్షాలకు ధాన్యం బస్తాలు తడిసిపోతున్నాయి. ప్రగతి సింగారం, వసంతపూర్, గంగిరేణిగూడెం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ధాన్యం తడిసిపోయింది.
గురువారం రాత్రి భారీ వర్షం పడడంతో పాటు శుక్రవారం కూడా మబ్బులు ఉండడంతో రైతులు ధాన్యం బస్తాల వద్దే కాపలా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరగా కొనుగోలు పూర్తికాక పోవడంతో తలకు మించిన భారంగా మారుతోందని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడం, పరదాలు ఇవ్వకపోవడం వంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. అధికారులు స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.
సంగెం : మండలంలో శుక్రవారం గాలి దుమారంతో పాటు వానకు పంటలు నేలవాలాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలి పనికి రాకుండా పోయాయి. కోతకు వచ్చి న వరి గాలివానకు కిందపడిపోయి వడ్లు పొలాల్లో రాలాయి. దీంతో తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు.
కాజీపేట : కాజీపేట రైల్వే జంక్షన్లో గురువారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ప్లాట్ఫాం మధ్యలోని రైలు పట్టాల పైకి వర్షం నీరు చేరుకుంది. దీంతో పాటు ఫారాలు కూడా తడిసి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పట్టాల మధ్య ఉన్న డ్రైనేజీల రంధ్రాలు మూసుకుపోవడంతో నీరు భారీగా చేరింది. ఆ సమయంలో ఎలాంటి రైళ్ల రాకపోకలు జరుగక పోవడంతో నష్టం జరుగలేదు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి సిబ్బందితో యుద్ధ ప్రతిపాదికన ప్లాట్ఫారం మధ్యలో మూసుకుపోయిన డ్రైనేజీల్లోని చెత్తా చెదారం తొలగించడంతో నీరు వెళ్లిపోయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఐనవోలు : అకాల వర్షంతో చేతికి అందివచ్చిన పంట నీటిపాలైంది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి కల్లల్లో ధాన్యం తడిచి ముద్దయింది. మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షానికి ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈరు గాలులకు మామిడి కాయలు పూర్తిగా నేల రాలినట్లు రైతులు తెలిపారు.
కాశీబుగ్గ : నగరంలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 14వ డివిజన్లోని ఎస్ఆర్నగర్, సాయిగణేశ్ కాలనీ, లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్, సుందరయ్య నగర్, 19వ డివిజన్లోని వివేకానంద కాలనీ, ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ రోడ్డు నీటతో నిండాయి. అలాగే 20 డివిజన్లోని పద్మానగర్, శాంతినగర్ ప్రాంతాలు చెరువులను తలపించాయి.
దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. బాటసారులు, వాహనదారులు ఇబ్బందులకు గురయ్యా రు. ఎస్ఆర్నగర్, సాయిగణేశ్ కాలనీల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. కార్పొరేటర్ తూర్పాటి సులోచన-సారయ్య వంద ఫీట్ల రోడ్డు కాల్వలోని చెత్తను తీసివేయడంతో కాలనీల్లోని వర్షపు నీరు తగ్గిపోయింది. కాగా, డ్రైనేజీలు సక్రమంగా లేకపోవడం వల్ల చినుకు పడితే కాలనీలు జలమయంగా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.