అకాల వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం అర్ధరాత్రి గాలివానతో మొదలైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం రైతులను ఆగంజేసింది. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. చేతికొచ్చిన పంటలు వానపాలై కన్నీరు మిగిల్చింది. కోతకు వచ్చిన వరి నేలవాలగా చేతికొచ్చిన మామిడి కాయలు రాలిపోయాయి. చాలా గ్రామాల్లో ఈదురుగాలుల ధాటికి రహదారులపై భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. మరిపెడలో రేకులు గాలికి ఎగిరిపోయి విద్యుత్ స్తంభంపై ఉన్న విద్యుత్ వైర్లపై పడ్డాయి. ఇళ్లపై వేసిన రేకులు గాలికి ఎగిరిపోయాయి. గోపతండాలో ఒక ఇల్లు నేలకూలింది.
మహబూబాబాద్, కురవి, సీరోలు, చిన్నగూడురు, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో అకాల వర్షంతో సుమారు 11,241 ఎకరాల్లో పంట నష్టం కలిగింది. నర్సింహులపేట మండలం అజ్మీరాతండా జీపీ పరిధిలోని ఎర్రకుంట తండాలో కోళ్లఫారం షెడ్డు కూలింది. మరిపెడ మండలంలోని బావోజిగూడెంలో చెరువు కట్టపై ఆరబోసిన ధాన్యంపై పరదాలు కప్పుతుండగా ఊడుగుల శ్రీనివాస్(21)పై పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా జనగామ జిల్లాకేంద్రంలో శనివారం సాయంత్రం మోస్తరు వర్షం కురవగా, మండలంలోని పలుచోట్ల వడగండ్లు పడ్డాయి. వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. అలాగే హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కమలాపూర్, ఉప్పల్, గూడూరులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడువగా, ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లింది.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్