వరంగల్, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపులు ఆగడం లేదు. అన్యాయంగా కొట్టడంతో పాటు కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారు. మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యే మెప్పు పొందేందుకు జాతరలో బీఆర్ఎస్ నాయకులను ఇష్టం వచ్చినట్లు కొట్టిన పోలీసులు తప్పును కప్పిపుచ్చుకునేందు వరుసగా అలాగే చేస్తున్నారు. వేధింపులకు గురి చేసిన పోలీసులపై బీఆర్ఎస్ ఒత్తిడితో శాఖాపరమైన విచారణ మొదలైనా ముందుకు సాగడం లేదు. న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రైవేట్‌గా కోర్టుకు వెళ్లడంతో పోలీసులకు నోటీసులు జారీ అయ్యాయి. మార్చి 6న హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా పోలీసులు అలాగే వ్యవహరిస్తున్నారు. ప్రైవేట్ కేసు నమోదు చేసిన బాధితులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. తమపై కేసు పెట్టిన వారిని వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు.
గతేడాది ఫిబ్రవరిలో హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం ఆగ్రంపహాడ్లోని సమ్మ క సారలమ్మ జాతరలో పోలీసుల అత్యుత్సాహంతో 12మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులకు తీవ్ర గా యలయ్యాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యా ప్తంగా సంచలనం సృష్టించింది. బీఆర్ఎస్ కార్యకర్తల నిరసనలు, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడి ఒత్తిడితో వరంగల్ పోలీసు కమిషనర్ చర్యలు చేపట్టారు. ఆత్మకూరు ఎస్సై దుర్గాప్రసాద్‌ను సస్పెండ్ చేశారు. పరకాల ఏసీసీ, కిశోర్ కుమార్, ఆత్మకూర్ సీఐ సంతోష్‌కుమార్, దామె ర ఎస్సై అశోక్‌పై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు. మామునూరు ఏసీపీ తిరుపతి, భూపాలపల్లి అదనపు ఎస్పీ బోనాల కిషన్‌లను విచారణ అధికారులుగా నియమించారు. విచారణ సమయంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు బాధితులను బెదిరించారు.
విచారణ జరిగే చోటుకి వెళ్లి పోలీసులకు వ్యతిరేకంగా చెప్పొద్దని హెచ్చరించారు. కేసులు ఉపసంహరించుకోవాలని, మీరు ఎకడి వెళ్లలేరని పోలీసులకు వ్యతిరేకం చెబితే తర్వాత కష్టాలు పడాల్సి వస్తుందని బెదిరించారు. పీడీ యాక్టులు, రౌడీషీట్లు నమోదు చేస్తామని భయపెట్టారు. ఆత్మకూరు, దామెర పోలీస్స్టేషన్లకు బాధిత బీఆర్ఎస్ నాయకులను పిలిపించి తీవ్రస్థాయిలో బెదిరించారు. సీఐ సంతోష్, దామెర ఎస్సై అశోక్ బూతులు తి ట్టారు. మొత్తంగా ఘటనతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది లేకుండా చేశారు. శాఖా పరమైన విచారణతోనూ న్యాయం జరగదనే ఆందోళనతో బాధితులు కోర్టులో ప్రైవేటు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత బాధితులకు వేధింపులు మరింత పెరిగాయి. ఆత్మకూరు సీఐ సంతోష్, దామెర ఎస్సై అశోక్ బాధితులపై అక్రమ కేసులు బనాయించారు. కొందరిపై రౌడీ షీట్ కేసులు నమోదు చేశారు. పోలీసులపై పెట్టిన ప్రైవేటు కేసును వాపసు తీసుకోకుంటే భవిష్యత్ ఉండదంటూ బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
మార్చి 6న కోర్టుకు రావాలని పోలీసులకు నోటీసులు
గతేడాది అగ్రంపహాడ్ సమ్మక సారలమ్మ జాతరలో తలెత్తిన చిన్న వివాదాన్ని సాకుగా చూపిస్తూ 10మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి పరకాల ఏసీపీ ఆధ్వర్యంలో ఆత్మకూరు ఎస్పై విచక్షణారహితంగా దాడి చేయడంపై బీఆర్ఎస్ లీగల్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కోర్టులో దాఖలు చేసిన ప్రైవేటు కేసులోని పరకాల అప్పటి ఏసీపీ కిషోర్ కుమార్, ప్రస్తుత ఆత్మకూరు సీఐ సంతోష్, ఎస్సై ప్రసాద్, అశోక్ మార్చి 6న కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ లీగల్ సెల్ అధ్యక్షుడు గుర్రాల వినోద్ కుమార్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల వేధింపుల విషయంపై మానవ హకుల కమిషన్‌లో మరో కేసు పెండింగ్‌లో ఉన్నదని చెప్పారు.
ఇదీ జరిగింది..
మేడారం జాతర సమయంలోనే అగ్రంపహాడ్లోనూ జాతర జరుగుతుంది. గతేడాది ఫిబ్రవరి 23న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల ఏసీపీకి, అక్కడి ఆలయ ఈవోకు సమాచారం ఇచ్చి దర్శనానికి వెళ్లారు. ధర్మారెడ్డి అక్కడికి వెళ్లే సమయానికి గేట్లు మూసి పెట్టి ఈవో, ఇతర అధికారులు అక్కడినుంచి వెళ్లిపోయారు. అక్కడికి భారీగా చేరిన భక్తులు, బీఆర్ఎస్ కార్యకర్తలలో కొందరు… జై చల్లా, జై తెలంగాణ అని నినాదాలు చేశా రు. తర్వాత గేట్లు తీసిన తర్వాత దర్శనం చేసుకుని వచ్చారు. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొట్లాట, ఘర్షణ అసలే లేదు. రాజకీయ ఒత్తిడితో ఆ తర్వాత రోజు వేధింపుల ప్రక్రియ మొదలైంది. జాతర వద్ద డ్యూటీలో ఉన్న తనను తోసుకుంటూ వెళ్లారని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి ఆత్మకూరు పోలీసు స్టేషన్లో ఓ కానిస్టేబుల్‌తో ఫిర్యాదు చేశారు. ఐపీసీలోని 143, 149, 353 సెక్షన్లతో పన్నెండు మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై శనివారం రాత్రి(ఫిబ్రవరి 24న) కేసు పెట్టారు.
పోలీసు స్టేషన్లో బెయిల్ ఇచ్చే సెక్షన్లే కావడంతో సోమవారం పోలీసు స్టేషన్‌కు వెళ్లి రావాలని బాధితులు భావించారు. ఏపీసీ కిశోర్, సీఐ సంతోష్ ఆదేశాలతో ఎస్సై ప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి ఆత్మకూరు పోలీసులు 12 మందిని హనుమకొండలోని టాస్క్ ఫోర్స్ ఆఫీసుకు తీసుకొచ్చారు. అక్కడ డ్రాయరు మాత్రమే ఉండేలా అందరితో బట్టలు విప్పించారు. ఒక్కొక్కరిపై ఐదారుసార్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రోకలిబండలు ఎక్కించారు. బెల్టులతో పిరుదులపై కొట్టారు. పోలీసుల దుశ్చర్యలపై ఫిబ్రవరి 25న ఉదయం వరంగల్ పోలీసు కమిషనర్‌కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆత్మకూరు స్టేషన్లో బెయిలు తీసుకుని బాధితులను విడిపించారు. బాధితుల ఫిర్యాదుతో ఆ తర్వాత ఆత్మకూరు ఎస్సైని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం కేసుపై విచారణ కొనసాగుతున్నది.