ఖిలావరంగల్, ఏప్రిల్ 25 : గుర్తుతెలియని వృద్ధురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం అర్ధరాత్రి వరంగల్ రైల్వే స్టేషన్ యార్డులో జరిగింది. వివరాల్లోకి వెళితే. వరంగల్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ జీ గంగాధర్ తెలిపిన కథనం ప్రకారం. సుమారు 70 ఏళ్ల వయసు కలిగిన గుర్తుతెలియని వృద్ధురాలు వరంగల్ రైల్వే స్టేషన్ యార్డులో 377/41 మైలురాయి వద్ద గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనలో ఆమె తలకు శరీర భాగాలకు తీవ్రంగా గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు ఆకుపచ్చ రంగు డిజైన్ గల చీర, పసుపు రంగు జాకెట్ ధరించి ఉంది. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. వరంగల్ రైల్వే అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం హాస్పిటల్లోని మార్చురీలో భద్రపరిచి దర్యాప్తు చేపట్టినట్టు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు వరంగల్ రైల్వేస్టేషన్లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు.