ములుగు, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో కొందరు రాజకీయ నాయకులు, దళారులు అధికారులతో కుమ్మకై దొడ్డి దారున ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ నియామకాలు చేస్తూ ముడుపులు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తున్నట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా మరికొందరు అధికారులను సభ్యులుగా నియమించి ఉద్యోగ నియామక కమిటీని ఏర్పాటు చేసి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలతో పాటు సంబంధిత ఉద్యోగానికి చెందిన సాంకేతిక పరీక్షలు నిర్వహించి పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటన్నింటిని తుంగలో తొక్కి అధికారులు, రాజకీయ నాయకులు గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే ఉద్యోగాలు కట్టబెడుతూ సంబంధిత ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నిర్వాహకుల ద్వారా నెల నెలా వేతనాలు సైతం అందిస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాలోని నిరుద్యోగులు నిరాశ, నిస్పృహకు లోనవుతున్నారు.
ములుగు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్), ప్రభుత్వ నర్సింగ్ కళాశాలతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టరేట్లో ఇటీవల పలు ఉద్యోగాలను గుట్టు చప్పుడు కాకుండా నియామకం చేసినట్లు తెలిసింది. ములుగు మెడికల్ కాలేజీ అనుబంధ దవాఖానగా మారిన జీజీహెచ్‌లో ఇటీవల ఒక ఎలక్ట్రిషియన్, ప్లంబర్, రెండు ఈసీజీ టెక్నీషియన్‌తో పాటు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టును నోటిఫికేషన్ లేకుండా దవాఖాన అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని కట్టబెట్టినట్లు సమాచారం. వైద్య విధాన పరిషత్ ఆధీనంలో పనిచేస్తున్న ఉద్యోగులున్నప్పటికీ వారిని తొలగించి నోటిఫికేషన్ లేకుండా కొత్త ఉద్యోగాలను కల్పించి నియామకాలు చేపడుతున్నారు. అలాగే ములుగు మెడికల్ కాలేజీలో 2025 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ లేకుండా సిబ్బందిని నియమించేందుకు అధికారులు ప్రయత్నించగా నిరుద్యోగుల పోరాటంతో కమిటీ వేసి ప్రక్రియను పూర్తి చేశారు. నర్సింగ్ కళాశాలో 2025 నవంబర్‌లో 22 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లేకుండా ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలను కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నించగా పత్రికల్లో కథనాలు వెలువడంతో తాత్కాలికంగా ప్రక్రియను నిలిపివేసి ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా అన్ని పోస్టులను భర్తీ చేసినట్లు తెలిసింది. ఇటీవల జన గణన కోసం కలెక్టరేట్లో 13 డేటా ఎంట్రీ పోస్టులను నోటిఫికేషన్ లేకుండా నియమించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భరోసా సెంటర్‌తో పాటు సఖీ కేంద్రంలో కూడా 10 ఉద్యోగాలను నోటిఫికేషన్ లేకుండా చేపట్టినట్లు తెలిసింది. కలెక్టర్ విచారణ చేసి ఉద్యోగ నియామకాల్లో జరిగిన అవకతవకలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని పలువురు నిరుద్యోగులు కోరుతున్నారు.