హనుమకొండ, ఆగస్టు 11 : తెలంగాణ మట్టి కీర్తిని ఉదయ్ కుమార్ నాగరాజు విశ్వవాప్తం చేశారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. బ్రిటన్ పార్లమెంట్లో హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా నియమితులైన లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజ్‌కు తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో హనుమకొండ రాంనగర్‌లోని ఓ బాంకెట్ హాల్లో పౌర సన్మానం నిర్వహించా రు. ముందుగా వరంగల్ రాజరాజేశ్వరి ఆలయ అర్చకుడు ఉదయ్ నాగరాజును వేద మంత్రాల తో ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా దేశపతి మాట్లాడుతూ ఓరుగల్లు మట్టి నుంచి ఎదిగిన ఉదయ్ ఇంగ్లండ్‌లోని అత్యుత్తమైన పెద్దల సభలో శాశ్వత సభ్యుడిగా నియమించడం దేశానికి గర్వకారణమన్నారు. తెలంగాణ వికాస సమితి ఉద్యమకారుల సమష్టి పూనికతో ఏర్పడిందని, రాష్ట్రం గర్వించే రీతిలో తన బాధ్యతను కొనసాగిస్తున్నదన్నారు. తెలం గాణ నేల అనగానే ధిక్కారం, పోరాటం, చైతన్యం గుర్తుకు వస్తాయన్నా రు.
తెలంగాణ కేవలం పోరాటాలకే పరిమితం కాకుండా గొప్ప విజ్ఞాన తృష్ణ, విశ్వజనీన భావాలున్న అద్భుతమైన మానవ వనరులున్న భూమి అని, దీనికి వరంగల్ ఒక గొప్ప సాక్ష్యమన్నారు. సాధారణంగా ఐఐటీ లు, సాంకేతిక రంగాల్లో చదివే విద్యార్థులు కెరీర్ ఓరియంటెడ్‌గా మాత్ర మే ఉంటున్న ప్రస్తుత కాలంలో, చదువుతో పాటు సామాజిక దృక్పథం ఉండటం అత్యంత ఆవశ్యకమని, సాంకేతికత అనేది కేవలం వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలన్నారు.
ఉదయ్ కుమార్ నాగరా జు మహాత్మా గాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రవాస భారతీయులను రాజకీయ, ప్రజాసేవా రంగాల్లో ప్రోత్సహిస్తున్నారన్నా రు. ఆయన సామాజిక దృక్పథాన్ని, విజ్ఞాన వికాసాన్ని గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ లార్డ్స్‌కి నామినేట్ చేసిందన్నారు. తెలంగాణలోని శనిగరం వంటి గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి చదువుకొని ఆయన ఈ స్థాయికి ఎదిగారని దేశపతి కొనియాడారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతూ బ్రిటన్‌లోని లేబర్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.
గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడినా ప్రజా సమస్యలపై ఆయనకు ఉన్న లోతైన పరిజ్ఞానాన్ని గుర్తించి హౌస్ ఆఫ్ లార్డ్స్‌గా నామినేట్ చేసిందన్నారు. భవిష్యత్ సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజంపై చూపే ప్రభావం, చట్టాల రూపకల్పన కోసం ఉదయ్‌ను ఈ పదవికి ఎంపిక చేశారన్నారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు తెలంగాణకు గర్వకారణమని, ఆయనకు వరంగల్‌తో విడదీయరాని అనుబంధం ఉందన్నారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎంపికైన తొలి వ్యక్తిగా తెలంగాణ ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు.
తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి బ్రిటన్ పార్లమెంట్లో విశిష్ట స్థానం అలంకరించిన నాగరాజును సత్కరించడం గర్వంగా ఉందన్నారు. ఉదయ్ తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలకు ఏఐ సాంకేతికతను మరింత చేరువచేయాలని కోరారు. లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజు మాట్లాడుతూ లండన్‌కు లార్డ్నైనా పుట్టిన స్థలానికి ముద్దుబిడ్డనేనన్నారు. ప్రధాని అందించిన ఈ పదవిని హోదాకన్నా ఒక పెద్ద బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.
రెండు దేశాల ప్రధాన మంత్రుల సమక్షంలో జరిగిన సీటా ఒప్పందం భవిష్యత్‌లో దౌత్యపరంగా బలోపేతం అవుతుందన్నారు. ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొన్న 20 మందిలో తాను ఒకరిగా నిలవడం అదృష్టంగా భావిస్తున్నారన్నారు. విదేశీ మంత్రులు, రాజకీయ నాయకులకు ఏఐపై అవగాహన కల్పించే ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ (119 దేశాలు) సెక్రటరీ జనరల్ చేసిన ప్రతిపాదన మేరకు 45 ఏళ్ల లోపున్న ప్రపంచ పార్లమెంటేరియన్లకు ఏఐపై అవగాహన కల్పించాలన్నారు.
ఇదే విషయమై లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాతో చర్చించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి, అడ్వకేట్లు సహోదర్‌రెడ్డి, వద్దిరాజు వెంకటేశ్వర్లు, గణేశ్, లింగంపల్లి కిషన్‌రావు, ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మేడిపల్లి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.