వేలేరు, జూన్ 19 : ఇద్దరి మధ్య పంచాయితీ చేస్తానని చెప్పి ఓ పెద్దమనిషి చెరో రూ.లక్ష రూపాయలు 2లక్షలు డిపాజిట్‌గా తీసుకుని పంచాయితీ నిర్వహించకుండా, డబ్బులు తిరిగి ఇవ్వకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్న ఘటన గురువారం రోడ్డుకెక్కింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలపల్లి గ్రామానికి చెందిన తూటిక మల్లమ్మ అనే వృద్ధురాలికి ఇద్దరు కూమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కూమారులలో పెద్ద కుమారుడు మృతి చెందగా అతని భార్య రాజేశ్వరి చంద్రాపూర్‌లో సింగరేణి ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు తూటిక శ్రీనివాస్ వరంగల్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే తల్లి పేరు మీద ఉన్న 1.05 గుంటల వ్యవసాయ భూమిని తల్లిని ఎవరు చూసుకుంటే వారికి పట్టా చేయాలని నిర్ణయించుకున్నారు.
అయితే మల్లమ్మ ముగ్గురు కుమార్తెలు తల్లిని చూసుకుంటామని భూమిని తమ పేరు మీద పట్టా చేసుకున్నారు. కొన్ని రోజులు గడిచాక తల్లికి సేవలు చేయలేమని చెప్పి పట్టా పాసుపుస్తకాలు, తల్లి మల్లమ్మను చిన్న కుమారుడు శ్రీనివాస్ ఇంటి వద్ద వదిలివెళ్లారు. దీంతో శ్రీనివాస్ తమ వదిన అయిన రాజేశ్వరికి విషయం చెప్పాడు. అయితే శ్రీనివాస్, రాజేశ్వరిల మధ్య ఉన్న పంచాయితీని పెద్దమనుషుల సమక్షంలో చేస్తామని నమ్మించి గ్రామానికి చెందిన కూరపాటి అశోక్ అనే వ్యక్తి పట్టా పాసుపుస్తకాలతో పాటు, ఇద్దరి వద్ద చెరో రూ.లక్ష మొత్తం రూ.2లక్షలు డిపాజిట్‌గా వసూలు చేశారు. పంచాయితీ పెట్టకపోగా రాజేశ్వరి వద్దా తీసుకున్న డిపాజిట్ డబ్బులు తిరిగి ఇచ్చేశాడు.
కానీ, శ్రీనివాస్ దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వక గత ఆరు నెలలుగా ఇబ్బందులు పెడుతున్నాడని బాధితులు తెలిపారు. అతనిపై వేలేరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా సివిల్ వ్యవహరాలు కోర్టులో తెల్చుకోవాలని సూచించినట్లు చెప్పారు. మా అమ్మగారైన తూటిక మల్లమ్మను నేనే చూసుకుంటున్నప్పటికీ తన వద్ద తీసుకున్న డిపాజిట్ పైసలు ఇవ్వకపోగా ఎక్కడ చెప్పుకుంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నట్లు బాధితుడు శ్రీనివాస్ తెలిపారు. పెద్ద మనిషి కూరపాటి అశోక్ నుండి ఎలాగైనా డబ్బులు ఇప్పించి తమకు న్యాయం చేయాలని బాధితుడు శ్రీనివాస్ కోరుతున్నాడు.