మల్హర్/పలిమెల, జూన్ 4 : జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. మల్హర్ మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన నేరేడుగొమ్మ మలహల్రావు (52) తన ఆయిల్ పామ్ తోట వద్దకు వెళ్లాడు. ఇదే సమయంలో ఈదురు గాలుల తో కూడిన వర్షం ప్రారంభమై ఒక్కసారిగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రి కావస్తున్నా మలహల్రావు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తోట వద్దకు వచ్చి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. పలిమెల మండలంలోని నీలంపల్లి గ్రామానికి చెందిన వాసం పద్మ (45) మరికొందరు మహిళలతో కలిసి గోదావరి నదికి చేపలు పట్టేందుకు వెళ్లింది. ఉరుములు, మెరుపులతో వాన పడుతుండడంతో ఇంటికి పరుగెత్తుకుంటూ వస్తుండగా పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కొడుకులున్నారు. కాగా, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.