కాటారం, జూన్ 2: కాటారం మండలంలోని గంగారం గ్రామంలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు ఇంటి ముందు కూర్చొని ఉన్న వారిని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మారపాక మధునమ్మ (80), నీలాల బాలయ్య (65), నీలాల మల్లయ్య, వీరి మనుమడు డానియేల్ ఇంటి ముందు ఆవరణలో కూర్చొని ఉన్నారు.
హైదరాబాద్కు చెందిన పలువురు వ్యక్తులు కాళేశ్వరం వెళ్లి తిరుగు ప్రయాణంలో గంగారం క్రాస్ వైపు అతివేగంగా వస్తూ అదుపు తప్పి రోడ్డు దిగి ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లింది. దీంతో మధునమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలతో బాలయ్యను భూపాలపల్లికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. డానియేల్, మల్లయ్యలకు తీవ్ర గాయాలయ్యాయి. కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్ ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అప్పటివరకు కళ్లెదుటే ఉన్నవారిని మృత్యువు రూపంలో కారు కబళించడంతో కుటుంబ సభ్యులు చేసిన రోదనలు కంట తడి పెట్టించాయి. కాగా, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ విషయం తెలుసుకొని గంగారానికి వచ్చి ప్రమాద స్థలాన్ని పరిశీలించి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు స్పందించక పోవడంతో ఎస్పీ కిరణ్ ఖరేకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన వారిని పరామర్శించారు. అనంతరం ఇటీవల కాళేశ్వరం పుష్కరాల్లో విధులు నిర్వర్తిస్తూ అస్వస్థతకు గురై మృతి చెందిన పారిశుధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు.