కొత్తగూడ, అక్టోబర్ 11: బహిర్భూమికని వెళ్లిన ఇద్దరు చిన్నారులు బావిలోపడి మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెంలో జరిగింది. స్థానికులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇటికాల నర్సయ్య, స్వాతి దంపతుల కుమారుడు రితిక్(9), నర్సయ్య సోదరి అనిత, శ్రీనివాస్ దంపతుల కుమారుడు జతిన్(10) దసరా పండుగ కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చారు. శనివారం అశోక్‌నగర్‌లోని బంధువు చనిపోవడంతో పిల్లలను ఇంటివద్దే ఉంచి వెళ్లారు.
ఈ క్రమంలో రితిక్, జతిన్ బహిర్భూమి కోసం సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. బావివద్ద చెప్పులు, బట్టలు చూసిన స్థానికులు పరిశీలించగా రితిక్ మృతదేహం వెలుగు చూసింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై రాజ్‌కుమార్ చేరుకోని బావిలో వెతకగా జతిన్ మృతదేహం లభించింది. చిన్నారులు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.