Dharmadsagar | ధర్మసాగర్ జూన్ 28 : తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందనే నెపంతో అతడితో పాటు ఓ మహిళను వివస్త్రను చేసి, గుండు గీయించి, ప్రైవేట్ పార్ట్స్‌లో జీడి పోసి హింసించిన ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగా అనే యువతికి, ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా రాజు సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకొని పది రోజుల క్రితం ఆమెతో కలిసి ఊరు విడిచి వెళ్లిపోయాడు. దీంతో సొంతింటికి వెళ్లిన గంగా జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది.
దీంతో వారు ఆ ఇద్దరిని వెతికి పట్టుకొని ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామంలోనే విచక్షణారహితంగా దాడి చేసి, ఇద్దరికీ గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి జననాంగంపై జీడీ పోసి తీవ్రంగా దాడి చేశారు. కాగా ఆ తరువాత ఆ ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. ఈ విషయంపై ఆనోటా.. ఈ నోటా.. పోలీసులకు తెలియడంతో కేసును సుమోటోగా స్వీకరించి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.