జనగామ, జనవరి 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి గెలిచిందని స్టేషన్‌ఘన్‌పూర్, జనగామ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి తాను ముఖ్యమంత్రి అనే సంగతి మరిచిపోయి స్థాయి దిగజారి మాట్లాడుతుంటే మంత్రులు అహంకారంతో రెచ్చిపోతున్నారని అన్నారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు 50రోజులు గడుస్తున్నాయని గుర్తుచేస్తుంటే సీఎం, మంత్రులు ఇంతెత్తున ఎగురుతున్నారని ఆగ్రహించారు. రైతుల పంట రుణాలు రూ.2లక్షల వరకు రుణమాఫీ ఫైల్‌పై ప్రమాణస్వీకారం చేసిన రోజే మొదటి సంతకం చేస్తానని చెప్పాడని తెలిపారు. కానీ ఈరోజు వరకు రైతు భరోసా పూర్తిస్థాయిలో అందలేదని, నెపాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెట్టి ఆరు గ్యారెంటీల అమలును పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వరకు తీసుకొచ్చి కాంగ్రెస్ సర్కారు కాలయాపనకు ప్రయత్నిస్తోందన్నారు.
కేసీఆర్‌ను చార్లెస్ శోభరాజ్‌గా, కేటీఆర్, హరీశ్‌రావును బిల్లా రంగలతో పోలుస్తూ అవహేళనగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని అన్నారు. శోభరాజ్, బిల్లా రంగల కంటే రేవంత్ చరిత్ర గొప్పదా? నువ్వు ఎన్ని కేసుల్లో ఉన్నడో తెలియదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మంత్రులు కాళేశ్వరం మీద పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, 1.25లక్షల ఎకరాలకు నీళ్లు విడుదల చేశామని సిద్ధిపేటలో మంత్రి కొండా సురేఖ అంటే మరో మంత్రి 50వేల ఎకరాలకు కూడా నీళ్లు రాలేదంటున్నారని ఎద్దేవా చేశారు. సీఎం, మంత్రుల భాష, భయపెట్టే ధోరణి మంచిది కాదని, అధికారం వచ్చింది కాదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతామంటే చెల్లదన్నారు. బెదిరింపులకు భయపడకుండా మరింత ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా, గవర్నర్ వ్యవస్థకు కళంకం తెచ్చేలా బీజేపీ నాయకురాలి ముసుగులో వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఎమ్మెల్యేలు కడియం, పల్లా అన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులకు, ఈ ప్రభుత్వం చేసే తప్పులకు గవర్నర్ బాధ్యులని, తప్పులు అంగీకరించడమంటే అది మీ బలహీనత అన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు. గవర్నర్ వ్యాఖ్యలపై మేధావులు, విద్యావంతులు స్పందించాలని పిలుపునిచ్చారు. తమిళిసై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కోటాలో కోదండరాంను ఎమ్మెల్సీగా అనుమతించిన తమిళిసై గతంలో దాసోజు శ్రవణ్ విషయంలో ఎందుకు నిరాకరించిందని ఎమ్మెల్యే కడియం, పల్లా ప్రశ్నించారు. ఎమ్మెల్సీ షెడ్యూల్ రెండు విడుతలుగా ఇవ్వడమే కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ అయినట్లు అర్థమైందని, గవర్నర్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. 1.75లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చింది, కావాలంటే శాఖల వారీగా వివరాలు అడగితే ఇస్తారని, యూనివర్సిటీలో ఉద్యోగాల ఫైల్ గవర్నర్ తొక్కిపెట్టలేదా? మేం తీసుకుంటే తప్పని చెప్పి రిటైర్డ్ వాళ్లను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. గవర్నర్ రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీ చేసుకోవచ్చని ఎమ్మెల్యేలు కడియం, పల్లా సూచించారు.
పోలీసులు, ఇంటలిజెన్సీ వ్యవస్థ, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి తీన్మార్ మల్లన్నను తెలంగాణలో చోటా నయీమ్‌లా తయారు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. తన మీద కక్ష సాధించాలని రోజూ ఏదో ఒక కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసి తప్పుడు కేసులు పెట్టినా తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన మీదే కేసు పెడుతున్నారంటే పేదల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. జడ్పీ, మున్సిపల్ చైర్పర్సన్లు భాగ్యలక్ష్మి, పోకల జమున, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు ఎడవెల్లి కృష్ణారెడ్డి, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు స్వరూప, ప్రేమలతారెడ్డి, కమలమ్మ, బీఆర్ఎస్ నాయకులు ఏబెల్, గుర్రం నాగరాజు, గజ్జెల నర్సిరెడ్డి, సందీప్, ఉడుగుల నర్సింహులు, తిప్పారపు విజయ్, పల్లవి, పెద్ది రాజిరెడ్డి ఉన్నారు.