సంక్రాంతి పండుగకు సొంతూరి రావాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. సరిపడా రైళ్లు లేక.. ఉన్న బస్సులు సరిపోక ప్రయాణికులు అనేక పాట్లు పడాల్సి వస్తోంది. ఇప్పటికే ఒకవైపు రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేయడంతో చాలా రైళ్లు నడవడం లేదు. ఇలాంటి సమయంలో ఆర్టీసీ అదనపు సర్వీసులు ఏర్పాటుచేయాలి. అయితే పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతామని అధికారులు చెబుతున్నప్పటికీ ప్రయాణికులకు అనుగుణంగా సర్వీసులు లేక ఇంటికి వెళ్లడమెలా అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రద్దీ రూట్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నదని. బస్సులో సీట్ల కోసం పోటీపడాల్సి వస్తున్నదని ఇప్పటికైనా సరిపడా బస్సులు వేయాలని కోరుతున్నారు.
– మహబూబాబాద్, జనవరి 9(నమస్తే తెలంగాణ)
సంక్రాంతి పండుగకు విద్యార్థులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు సొంత ఊరికి చేరుకుంటారు. రైళ్లు అరకొరగా నడుస్తుండడంతో వారంతా బస్సులపై ఆధారపడుతున్నారు. రైళ్లు రద్దయిన సందర్భంలో ఆర్టీసీ అదనంగా బస్సు సర్వీసులు విధిగా నడపాల్సి ఉంటుంది. ఇది ఎకడా అమలు కావడం లేదు. రైల్వే శాఖ మూడో లైన్ పనులు, ఇతర మరమ్మతుల కారణంగా గత నెల 28 నుంచి కొన్ని రైళ్లను రద్దు చేసింది. ఇక జనవరి మొదటి వారం నుంచి కొన్ని రైళ్లను సికింద్రాబాద్ నుంచి వయా నల్గొండ జిల్లా మీదుగా నడుపుతుండగా, మరికొన్ని రైళ్లు రద్దు అయ్యాయి.
ఈ క్రమంలో నిత్యం వేల సంఖ్యలో ప్రయాణించే ఉద్యోగులు, వ్యాపారాలు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, తదితర ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. గత నాలుగైదు రోజుల నుంచి కాజీపేట నుంచి విజయవాడ వైపు ఉదయం పూట ఒకటి రెండు రైళ్లు మినహాయిస్తే మిగిలినవన్నీ దాదాపు నడవలేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఒకవైపు రైళ్ల రద్దు, మరోవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ప్రస్తుతం నడుస్తున్న బస్సులతో పాటు మరిన్ని సర్వీసులు కేటాయించాల్సి ఉండగా వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించినట్లు ప్రయాణికులు వాపోతున్నారు.
మహబూబాబాద్ నుంచి వయా గూడూరు, నర్సంపేట మీదుగా వరంగల్‌కు వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు గంటలకు ఒకటి ఎక్స్‌ప్రెస్ బస్సు వస్తే దాని వెంట వందల మంది ప్రయాణికులు పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మహబూబాబాద్ నుంచి తొర్రూరుకు అన్ని పల్లె వెలుగు బస్సులు తప్ప ఎక్స్‌ప్రెస్ బస్సుల్లేవని ప్రయాణికులు వాపోతున్నారు. మహబూబాబాద్ నుంచి వయా కురవి, మరిపెడ మీదుగా సూర్యాపేటకు వెళ్లాలంటే కూడా పల్లె వెలుగు బస్సు దికు అయింది. అటు రైళ్లు లేక, ఇటు బస్సులు రాక ప్రయాణికులు నానా తంటాలు పడుతున్నారు. పండుగకు మరో మూడు రోజులే ఉండటంతో సొంతూళ్లకి వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సులు నడపాలని డిమాండ్ చేస్తున్నారు.
బస్సులు అదనంగా నడపాలి
గత పది రోజులుగా రైళ్లు నడవడం లేదు. చా లా ఇబ్బందులు పడుతున్నాం. మరోవైపు బస్సు లు కూడా అరకొరగా నడుపుతున్నారు. అదనంగా బస్సులు నడపాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తమ సొంత గ్రామాలకు తరలివస్తున్నారు. దీంతో రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులు నడపాలి.
– బత్తిని కిషోర్, ప్రయాణికుడు, మహబూబాబాద్