దంతాలపల్లి, జనవరి 15 : ఆరోగ్యం బాగాలేదని సర్కారు దవాఖానకు వచ్చిన మహిళలకు ఇబ్బందులు తప్పలేదు. సకాలంలో స్పందించాల్సిన డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోగా, చికిత్స కోసం అవసరమైన మందులు, సిరంజీలు లేకపోవడంతో రోగులకు పరీక్ష పెడుతోంది. ఈ సంఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జరిగింది. పులుగుజ్జ శంకరమ్మకు వాంతులై నీరసంగా ఉండడంతో కుటుంబసభ్యులు బుధవారం ఆమెను పీహెచ్సీకి తీసుకొచ్చారు. ఆ సమయంలో డాక్టర్ లేకపోవడంతో అందుబాటులో ఉన్న స్టాఫ్ నర్సు చికిత్స చేసేందుకు ప్రయత్నించింది.
ఇంజక్షన్ వేసేందుకు 2 ఎంఎల్ సిరంజీలు లేవని, బయటకు వెళ్లి కొనుగోలు చేసి తెచ్చుకోవాలని తెలిపింది. డాక్టర్ అందుబాటులో లేకపోగా కనీసం ఆసుపత్రిలో మందులు కూడా లేకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు. దీనిపై డాక్టర్ చైతన్యను వివరణ కోరగా సాయంత్రం 5గంటలకు శంకరమ్మను ఆసుపత్రికి తీసుకువచ్చారని, తాను అందుబాటులో లేకున్నా సిబ్బందికి చికిత్స అందించాలని తెలిపానన్నారు. ఆసుపత్రిలో మందులు కొరత ఉన్నది వాస్తవమేనని అంగీకరిస్తూనే శంకరమ్మ కొంత మద్యం సేవించినట్లు సిబ్బంది తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పడం గమనార్హం.