మహబూబాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ గౌస్ పాషాతోపాటు అతని డ్రైవర్ ఎలమందల సుబ్బారావు, ప్రైవేట్ వ్యక్తి రాంగోపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ డీటీవోగా గౌస్ పాషా విధుల్లో చేరినప్పటి నుంచి అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కొంతమంది వాహనదారులు ఏసీబీ అధికారులకు లేఖలు రాయడంతో వారు గత మే 28న రవాణా శాఖ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్ సుబ్బారావు వద్ద లెక్కల్లో చూపని రూ.61,600 నగదుతో పాటు అతని వద్ద లభ్యమైన మొబైల్ ఫోన్‌ను ఏసీబీ అధికారులు స్వాధీన పరుచుకున్నారు.
అనంతరం మొబైల్ ఫోన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయగా రోజు వచ్చే లంచాలు, నెలనెలా వచ్చే మామూళ్ల్లతోపాటు వివిధ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలను గుర్తించారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో పనిచేసిన సమయంలో అతని కుమారుడు మహ్మద్ అరీఫుద్దీన్, మేనల్లుడు మహ్మద్ మునీర్‌తో కలిసి రూ.2.97లక్షలు లంచం వసూలు చేసినట్లు విచార ణలో తేలింది. ఇవి కాకుండా మరిన్ని అక్రమాలు వెలుగుచూ డడంతో ఈ నెల 11న ముగ్గురిని అరెస్ట్ చేసి సోమవారం వరంగల్ లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు.
మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 12 : జిల్లా ఇన్చార్జి రవాణా శాఖ అధికారిగా సాయిచరణ్ సోమవారం సాయంత్రం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన డీటీవో గౌస్‌పాషాను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించా రు. దీంతో ఇన్చార్జి డీటీవోగా సాయిచరణ్‌ను నియమిస్తూ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.