సుబేదారి, ఫిబ్రవరి 8: ఆదాయాని కి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే స మాచారంతో వరంగల్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ నివాసంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. డీటీసీ మొత్తం రూ.4,04,78,767 విలువైన ఆస్తులు కలిగి ఉన్నట్లు వారు తేల్చారు.
మూడు గృహాల విలువ రూ. 2,79,32,740,16 ఓపెన్ ప్లాట్లు రూ.13,57,500, 15.20 ఎకరాల వ్యవసాయ భూమి రూ.14,04,768, బ్యాంకు బ్యాలెన్స్ రూ. 5,85,409, గృహోపకరణాలు రూ. 22, 85,700, 3 ఫోర్ వీలర్స్, ఒక బైక్ రూ. 43.80 లక్షలు, 1542.8 గ్రాముల గోల్డ్ రూ. 19,55, 650, 400 గ్రాముల వెండి రూ. 28వేలు, 23 విదేశీ మద్యం బాటిళ్ల విలువ రూ. 5.29 లక్షలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, పలివేల్పులలోని డీటీసీ శ్రీనివాస్ ఇంట్లో సోదాలు పూర్తయిన తర్వాత శనివారం ఆయనను అరెస్ట్ చేసి హనుమకొండలోని ఏసీబీ కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్లు వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.