Kuravi News | కురవి : ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒకటి నుంచి 19 ఏళ్ల వయసువారందరికీ ఆల్బండజోల్ మాత్రలు వేయాలని బలపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలిపారు. బలపాల పీహెచ్ సీ ఆవరణలో పారామెడికల్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల సైన్స్ టీచర్లు, ఆశ కార్యకర్తలకు శుక్రవారం నులిపురుగుల నివారణ దినోత్సవం సంబంధించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ అర్హులైన పిల్లలకు నోటి మాత్రలను అందించాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ.. చికిత్స తీసుకుంటున్న వారికి మాత్రం నోటి మాత్రలు ఇవ్వకూడదని చెప్పారు. ఆరోగ్య స్థితిని బట్టి, మిగిలిపోయిన పిల్లలకు మాప్ డే రోజున అందించాలని సూచించారు. ఆరుబయట చేతులు కడుక్కోండా ఆహారం తీసుకోవాలని.. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం.. అపరిశుభ్ర పరిసరాలతో నులిపురుగులు సంక్రయిస్తాయన్నారు.
నులిపురుగుల ప్రభావంతో పిల్లలు రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం, విరేచనాలు బరువు తగ్గడం గ్రహించవచ్చని సూచించారు. డోర్నకల్ సీడీపీవో లక్ష్మి మాట్లాడుతూ నులిపురుగులతో పిల్లల శారీరక, మానసిక అభివృద్ధి కుంటుపడుతుందని, విషయ సంగ్రహణ అనేది దెబ్బతింటుందన్నారు. తద్వారా వారి అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. పరిసరాలు పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, బహిరంగ మలవిసర్జన నివారించాలని కోరారు. నులిపురుగుల నివారణ నోటి మాత్రల ఆవశ్యకత గురించి విద్యార్థులకు, తల్లిదండ్రులకు గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో మహిళా సంఘాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైద్యులు యశస్విని, కరుణాకర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ భద్రమ్మ, సీనియర్ అసిస్టెంట్ కుమారస్వామి, ఆరోగ్య విస్తరణ అధికారి స్వామి, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ శోభ, హెల్త్ సూపర్వైజర్ ఏసుమని, పాఠశాల సైన్స్ టీచర్ జయశ్రీ పాల్గొన్నారు.