సుబేదారి, ఫిబ్రవరి 4 : హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఓ న్యాయవాదిపై దాడి చేశాడు. చొక్కా పట్టుకొని అడ్వకేట్ అయితే ఏందిరా అంటూ బూతులు తిడుతూ తల, చెవిపై కొట్టాడు. అంతటితో ఆగకుండా అతడిని పోలీసు వాహనంలో హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు పెట్టించాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి హనుమకొండలోని కేయూ జంక్షన్ వద్ద జరిగింది. బాధితుడైన న్యా యవాది గంధం శివ కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి శివ వెళ్లాడు.
అనంతరం అక్కడే కల్లు తాగి రాత్రి 7 గంటలకు హనుమకొండకు బయలుదేరాడు. కేయూ జంక్షన్‌కు చేరుకునే సరికి డ్రంక్ అండ్ డ్రైవ్ విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును ఆపి పరీక్షిస్తుండగా తాను న్యాయవాదినని, చావు కార్యక్రమానికి వెళ్లి కల్లు తాగినట్లు చెప్పాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్సై ‘నీవు ఎవరైతేందిరా.. టెస్ట్ చేసుకోరా’ అనడంతో ఇద్దరి మద్య గొడవ జరిగింది. సమాచారం అందుకున్న హనుమకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డి అక్కడికి వచ్చి శివ చొక్కా పట్టుకొని ‘లం..కొడుకా.. అడ్వకేట్ అయితేందిరా’ అంటూ తల, చెవిపై బలంగా కొట్టి పో లీసు వాహనంలో ఎక్కించారు.
ఆ తర్వాత సీఐ, ఎస్సై, సిబ్బంది మూకుమ్మడిగా దాడి చేసి హనుమకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి కేసు పెట్టించారు. అయితే తాను ఇన్స్పెక్టర్ సీతారెడ్డిపై ఫిర్యా దు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. రెండ్రోజుల క్రితం కేయూ జంక్షన్ వద్ద హసన్పర్తికి చెందిన ద్విచక్రవాహనదారుడిని సదరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చితకబాదినట్లు తెలిసింది. కాగా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు బాధితు డు శివతో కలిసి మంగళవారం ఏసీపీని కలిశారు.
శివపై కేసు నమోదు
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షను అడ్డుకొని ఎస్సై యుగేంధర్, కానిస్టేబుల్ రమేశ్‌ను దూషించిన గంధం శివపై కేసు నమోదు చేసినట్లు హనుమకొండ పోలీసులు తెలిపారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో శివ మద్యం సేవించి కారు నడపుతూ కేయూ జంక్షన్‌కు వచ్చాడని, అతడిని ఎస్సై, కానిస్టేబుల్ ఆపగా తాను అడ్వకేట్నంటూ న్యూసెన్స్ చేశాడన్నారు. తనకు టెస్ట్ చేస్తే నాలుగు రోజులు కోర్టు బంద్ చేసి తడాఖా చూపిస్తానని నానా హంగామా చేస్తూ విధులను అడ్డుకున్నాడని వారు పేర్కొన్నారు.
ట్రాఫిక్ సీఐని సస్పెండ్ చేయాలి
వరంగల్ లీగల్: న్యాయవాది గంధం శివపై దాడి చేసిన ట్రాఫిక్ సీఐ సీతారెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలని వరంగల్, హనుమకొండ బార్ అసోసియేషన్లు తీర్మానించాయి. మంగళవారం అంబేదర్ హాల్లో వరంగల్ బార్ అధ్యక్షుడు తీగల జీవన్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సంయుక్త సమావేశంలో శివపై జరిగిన దాడిని ఖండించాయి. ట్రాఫిక్ సీఐ దాడిచేయడమే కా కుండా కేసు పెట్టి న్యాయవాదులను చిన్నచూ పు చూడడం హేయమైన చర్యగా తెలిపాయి. దాడిలో పాల్గొన్న సిబ్బందిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరాయి. సమావేశంలో బార్ కౌన్సిల్ మెంబర్లు బైరపాక జయాకర్, దుస్సా జనార్దన్, హనుమకొండ బార్ ప్రెసిడెంట్ మా తంగి రమేశ్‌బాబు, వరంగల్, హనుమకొండ ప్రధాన కార్యదర్శులు ముద్దాస్సిర్ అహ్మద్ ఖయ్యూమి, లడే రమేశ్, సీనియర్ న్యాయవాదులు ముద్దసాని సహోదర్‌రెడ్డి, పులి సత్యం, గుడిమల్ల రవికుమార్, ఐత ప్రసాద్, వలస సుధీర్, సదాశివుడు పాల్గొన్నారు.