పోచమ్మమైదాన్, డిసెంబర్ 26 : స్వరబ్రహ్మ.. మిమిక్రీకి ప్రపంచస్థాయి గుర్తింపుతెచ్చిన కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్. కడుపుబ్బ నవ్వించే ప్రదర్శనలతో తనకంటూ ఒక గుర్తింపు పొందారు. ధ్వన్యనుకరణ సామ్రాట్ బిరుదు పొంది తెలంగాణకు పేరు తీసుకొచ్చిన నేరెళ్ల మనమధ్య లేకపోయినా ఆయన అనుకరించిన మిమిక్రీ, తయారు చేసిన కళాకారులు ఎందరో కళ్ల ముందరే ఉన్నారు. ఈ నెల 28న వేణుమాధవ్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
వరంగల్ మట్టెవాడకు చెందిన నేరెళ్ల శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు వేణుమాధవ్ 1932, డిసెంబర్ 28న జన్మించారు. హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో చదువుకుంటూనే సాంస్కృతిక కార్యక్రమాల వైపు మక్కువ చూపేవారు. ఆనాడు ఎక్కువగా ఇంగ్లిషు సినిమాలు చేస్తూ వాటిలో ఆర్టిస్టు గొంతులు, ముఖ్య సన్నివేశాలను విద్యార్థుల ముందు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ను వినిపించేవారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అనేక మిమిక్రీ ప్రదర్శనలు చేసి విద్యార్థులను ఆకట్టుకున్నారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో 1947లో తొలి మిమిక్రీ ప్రదర్శన ఇచ్చి మంచి గుర్తింపు పొందారు. 1953లో రాజమండ్రిలో మలి ప్రదర్శన మిమిక్రీ ద్వారా మరెంతో ఎత్తుకు చేరుకున్నారు.
1947 నుంచి ఊపందుకున్న మిమిక్రీ ప్రదర్శనలు అంచెలంచెలుగా అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాయి. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మిమిక్రీ ప్రదర్శనలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఐక్యరాజ్యసమితిలో కూడా ప్రదర్శన చేసి భారతదేశానికి వన్నె తెచ్చారు. వేణుమాధవ్ మిమిక్రీతో పాటు రాజకీయరంగంలో కూడా ప్రవేశం పొందారు. 1972 నుంచి 1978 వరకు ఎమ్మెల్సీగా, ఏపీ లెజిస్లేటివ్ సభ్యుడిగా, సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా పనిచేశారు. పలు యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లు, అవార్డులు అందుకుని ఓరుగల్లు కీర్తి ప్రతిష్టతను ఇనుమడింపజేశారు.
2015లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో జీవన సాఫ ల్య పురస్కారం, 2018లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకున్నారు. చివరకు 2018, జూన్ 19న కన్నూమూశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరుమీద హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ప్రత్యేకంగా కళా ప్రాంగణం నిర్మించి, విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా తోటి కళాకా రులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ చేసి, ఆయన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఒకరికి రూ.10వేల నగదుతో పాటు పురస్కారాన్ని అందజేస్తారు. ఈ సంవత్సరం వరంగల్‌కు చెందిన ప్రముఖ కవి, కథా రచయిత, నవలాకారుడు రామా చంద్రమౌళి ఎంపికయ్యారు. కాగా, ఆయన భార్య శోభావతి వృద్ధాప్యంలో కూడా ఇన్నర్‌వీల్ క్లబ్ వ్యవస్థాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
నేరెళ్ల వేణుమాధవ్ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో ఈ నెల 28న సాయంత్రం 5 గంటలకు స్వరార్చన, వేణుమాధవ్ శిష్యులు, ప్రముఖ మిమిక్రీ కళాకారుల ధ్వన్య నుకరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రముఖ కవి అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగే సభలో ముఖ్య అతిథిగా ప్రముఖ గాయకుడు వరంగల్ శ్రీనివాస్, విశిష్ట అతిథిగా ఫన్స్టార్ శివారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, జబర్దస్త్ ఫేమ్, సినీ నటుడు రాకింగ్ రాకేశ్ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి రామాచంద్రమౌళికి పురస్కారం అందజేసి, సన్మానించనున్నారు.