ఏ భాష నీది!? ఏమి వేషమురా!ఈ భాష, ఈ వేషమెవరి కోసమురా?ఆంగ్లమందున మాటలనగానే.. ఇంత కుల్కెదవెందుకురా!? తెలుగువాడివై.. తెలుగు రాదనుచు.. సిగ్గులేక ఇంక చెప్పుటెందుకురా.. అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా.. చావవెందుకురా..!
– కాళోజీ
పోచమ్మమైదాన్, సెప్టెంబర్ 8 : ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు, ఓరుగల్లు సాహితీ శిఖరం కాళోజీ నారాయణరావు పేరు విననివారుండరు. ఉద్యమ ప్రతిధ్వనిగా ప్రజలను మేల్కొపిన మహాకవి. నిజాం నిరంకుశత్వం, అరాచకపాలనకు వ్యతిరేకంగా కలమెత్తిన అక్షరయోధుడు. ఓరుగల్లులో పుట్టి పెరిగి, తనువు చాలించిన కాళోజీ నారాయణకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ ఎనలేని గౌరవాన్ని ఇచ్చారు. సెప్టెంబర్ 9న ఆయన పుట్టిన రోజును ప్రత్యేకంగా తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించారు.
వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య విశ్వవిద్యాలయానికి కాళోజీ పేరు పెట్టి ఆయన చేసిన సేవలకు నిదర్శనం.
అలాగే హనుమకొండలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న కాళోజీ కళాక్షేత్రం కూడా నేటి కవులు, సాహితీవేత్తలు, కళాకారులకు నిలయంగా మారనుంది. ఉద్యమమే ఊపిరిగా జీవించిన కాళోజీ కర్నాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా రట్టిహళ్లీ గ్రామంలో జన్మించారు. తల్లి రామాబాయమ్మ కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. బీజాపూర్ నుంచి వరంగల్ జిల్లాకు తరలివచ్చిన కాళోజీ కుటుంబం ఇక్కడే స్థిరపడింది. కాళోజీ తెలుగు, ఉర్దూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లిషు భాషల్లో రచయితగా మంచిపేరు సంపాదించుకున్నారు.
రాజకీయ వ్యంగ కవిత్వం రాయడంలో దిట్ట. విద్యార్థి దశలోనే ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్‌లో గణపతి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్‌లను స్థాపించారు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్ ద్వితీయ మహాసభలను దిగ్విజయం చేశారు.
వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు అతడికి నగర బహిష్కరణ శిక్ష విధించినా బెదరలేదు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విశ్వ విద్యాలయం విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగపూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకున్నారు. 1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా, 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కాళోజీ పుట్టిన రోజును తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్నారు. తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేష సేవలు అందించనవారిని గుర్తించి రాష్ట్రస్థాయి కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆనాటి సీఎం కేసీఆర్ 2014 సెప్టెంబర్ 9న కాజీపేట నిట్‌లో నిర్వహించిన కాళోజీ నారాయణరావు 100వ జయంతి సభలో కాళోజీ పురస్కారాన్ని ప్రకటించారు. అలాగే ప్రజాకవిని స్మరిస్తూ ఏటా సెప్టెంబర్ 9న తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలని గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
దీంతో 2015లో తొలిసారిగా ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించి, కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారం కింద రూ.1,01,116 నగదుతోపాటు మెమెంటోను సీఎం, ఇతర మంత్రులు అందజేశారు. 2015 సంవత్సరంలో రచయిత, సాహితీ విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్ అందుకోగా, తాజాగా, ఈ ఏడాది 2024లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కవి, రచయిత, సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు నలివెల భాస్కర్‌కు పురస్కారాన్ని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు వైద్య కళాశాలలన్నీ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం నూతనంగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని కేసీఆర్ ప్రత్యేక చొరవతో 2014, సెప్టెంబర్ 26న స్థాపించారు. అనంతరం దీనికి 2016 ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం పరిధిలో అనుబంధ కళాశాలలన్నీ పనిచేస్తున్నాయి.
అలాగే సాహితీవేత్తలు, కళాకారుల కోసం గత ప్రభుత్వ హయాంలో హనుమకొండలో కాళోజీ కళా క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. కేసీఆర్ కృషి వల్ల కళాక్షేత్రాన్ని మూడున్నర ఎకరాల్లో నిర్మాణం చేపట్టగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఇందులోనే కాళోజీ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేశారు. ‘హింస తప్పు.. రాజ్యహింస మరీ తప్పు.. అంటూ సామాన్యుడే నా దేవుడు అని ప్రకటించిన కాళోజీ నారాయణరావు 2002 నవంబర్ 13న తుదిశ్వాస విడిచారు. ఆ మహనీయుడి మరణాంతరం కాళోజీ కోరిక మేరకు పార్థీవదేహాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అప్పగించారు.