హానుమకొండ, ఆగస్టు 5: తెలంగాణ సిద్ధ్దాంతకర్త, ఉద్యమ భావ జాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మలిఋ దశ ఉద్యమానికి దిక్సూచిగా తెలంగాణ జన హృదయాల్లో నిలిచిన ఆయన రాష్ట్ర సాధనకు కోసం చేసిన త్యాగం మరువలేనిది. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ప్రస్తుత హనుమకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారు.
అతను తెలంగాణ సాధన కోసం ఎనలేని కృషి చేశాడు. ఆయన గుర్తుగా కుడా ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ఏకశిలా పార్కుకు జయశంకర్ స్మృతి వనంగా పేరుపెట్టారు. నేడు ఆయన జయంతి వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో వేడుకలు జరుపుకోనున్నారు. హనుమకొండలోని ఏకశిల పార్కులో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలో కలెక్టర్ ప్రావీణ్య, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారు.