మహబూబాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : ‘ఓ నిజాం పిశాచమా.. కానరాడు.. నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, నా తెలంగాణ.. కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటి, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిలూదిన ధీశాలి దాశరథి కృష్ణమాచార్యులు. నిజాం నిరంకుశ పాలన, భూస్వాములు, పెత్తందార్ల అరాచకాలపై అక్షర శరాలతో ధిక్కార స్వరం వినిపించి, స్వేచ్ఛాస్వాతంత్య్రాలు కోల్పో యి జీవచ్చవాల్లా బతుకుతున్న తెలంగాణ సమాజంలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఆ మహనీయుడి శతజయంతిని సోమవారం అతడి స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించేందుఉ గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు.
చిన్నగూడూరు మండల కేంద్రంలో 1925 జూలై 22న దాశరథి వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతులకు కృష్ణమాచార్యులు జన్మించాడు. తన బాల్యం ఉర్దూలో మెట్రిక్యులేషన్, బోపాల్ విశ్వవిదాలయంలో ఇంటర్మీడియట్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ సాహిత్యంలో బీఏ పూర్తి చేశారు. సంస్కృతం, ఆగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు, కవి, రచయిత. చిన్నతనం నుంచే పద్యాలు అల్లడంలో దిట్ట. పలు సినిమాలకు గేయ రచయితగా, ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్, ఆకాశవాణి ప్రయోక్తగా పని చేశారు. సాహిత్య రంగంలో ఆయన చేసిన కృషి మరువలేనిది. కథలు, నాటికలు, సినిమా పాటలు, కవితలు రాశారు. నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు రకరకాల హింసలనభిస్తున్న తెలంగాణను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు.
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వ హయాంలో జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాద్‌లోని ఇందూరు కోటలో ఆయనతోపాటు మరో 150మంది ఖైదీలుగా జైలులో ఉన్నారు. పళ్లు తోముకోవడానికి బొగ్గుతో జైలు గోడలపై పద్యాలు రాసి దెబ్బలు తిన్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత భావ ప్రేరిత ప్రసంగాలతో ఊరురా సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించాడు. దాశరథి రచించిన ‘ఆ చల్లని సముద్ర గర్భం..దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో..రచనలు ఇప్పటికీ ప్రజల మన్ననలు పొందుతున్నాయంటే అది దాశరథి ముద్ర అని చెప్పాలి. ‘రైతుదే తెలంగాణము రైతుదే.. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు.
‘దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, జగత్తంతా నగరాలు కొడుతున్నది, దిగిపోవోయ్,తెగిపోవోయ్’అంటూ నిజాం పాలకులకు సింహస్వప్నంలా మారి కంటిమీది కునుకులేకుండా చేసి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోశారు. రుద్రవీణ, అగ్నిధార, కవితాపుష్యకం, పునర్నవం, అమృతాభిషేకం, తిమిరంలో సమరం వంటి సంకలనాలు, అద్భుత కావ్యాలు దాశరథి కలం నుంచి జాలువారినవి. మారుమూల గ్రామమైన చిన్నగూడూరులో జన్మించి ఎన్నో అవార్డులు, బిరుదులు అందుకుని తెలుగు భాష, తెలంగాణ కీర్తిని ప్రంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి దాశరథి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా దాశరథికి అప్పటి ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చింది.
మానుకోట మట్టిబిడ్డ, మహాకవి దాశరథి శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మహబూబాబాద్ పట్టణంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్ ఉత్సవాలు నిర్వహించనుండగా, కవులు, కళాకారులు, రచయితలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు చిన్నగూడూరు నుంచి మహబూబాబాద్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే రామ్చంద్రూనాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్సీ దేశపతిశ్రీనివాస్ తదితరులు హాజరు కానున్నారు. దాశరథి శతజయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అధ్యక్షతన ఉత్సవాలు నిర్వహించనున్నారు.
మహాకవులు, ఉద్యమ స్ఫూర్తి ప్రదాతలు దాశరథి కృష్ణమాచార్యులు, రంగాచార్యులు జన్మించిన మండల కేంద్రానికి దాశరథి చిన్నగూడూరుగా నామకరణం చేయాలని, ఇద్దరు సోదరుల విగ్రహాలను హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.
దాశరథి కృష్ణమాచార్యుల శతజయంతి ఉత్సవాలను సంవత్సరంపాటు నిర్వహిస్తాం. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసి, పీడిత ప్రజల గొంతుకగా మారిన ఆయన సేవలు వెలకట్టలేనివి. పార్టీలకతీతంగా ఈ ఏడాది జూలై 22 నుంచి వచ్చే ఏడాది జూలై 22 వరకు ఉత్సవాలు నిర్వహిస్తాం. కవులు, రచయితలు, ప్రముఖులు అందరినీ ఆహ్వానించాం. అందరూ పాల్గొని శతజయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలి.
-ఉత్సవ కమిటీ చైర్మన్ తక్కళ్లపల్లి రవీందర్రావు