హనుమకొండ, అక్టోబర్ 8 : హక్కుల ఉద్యమ దిక్సూచి, మానవ హక్కుల వేదిక నేత డా.బాలగోపాల్ 16వ యాది సభ ఈనెల 12న ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మానవ హక్కుల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య పిలుపునిచ్చారు. సభ పోస్టర్లను కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్డీఎల్ ఎస్ఈ సావిత్రి, జ్యోతిభా ఫూలే కేంద్రం వద్ద ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తిరుపతయ్య మాట్లాడుతూ అంతర్జాతీయ అంశాలతో పాటు దేశ, రాష్ట్ర సమస్యలను గురించి వక్తలు ప్రసంగిస్తారని, దేశంలో ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న లోపాలు, ఓట్ల తొలగింపు, పతనమవుతున్న ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక రెండు రాష్ట్రాల సమన్వయకర్తలు వసంత లక్ష్మీ, వి.ఎస్.కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు బదావత్ రాజు, రాష్ట్ర కార్యదర్శి టి.హరికృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.దిలీప్ , హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.రోహిత్, సామాజిక కార్యకర్త సంధ్య, వెంకటనారాయణ, సాధు రాజేష్ ఉన్నారు.