నర్సంపేట/ఖానాపురం/కొత్తగూడ,డిసెంబర్ 29: పెద్దపులి సంచారంతో రైతులు, వ్యవసాయ కూలీలు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. శనివారం రాత్రి రుద్రగూడెం మీదుగా ఆదివారం నర్సంపేట మండలంలోని ముత్యాలమ్మతండా, జంగాలపల్లి తండాల మీదుగా ఖానాపురం మండలంలోని దబీర్‌పేట, కీర్యతండాల శివారుకు పులి వచ్చినట్లు అటవీ శాఖాధికారులు గుర్తించారు. అక్కడి నుంచి పాకాల అటవీ ప్రాంతం గుండా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెం అటవీ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు పాదముద్రల ఆధారంగా నిర్ధారించారు.
సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముత్యాలమ్మ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జంగాలపల్లితండాలో లకావత్ సీతారాములు చెలకలో పాదముద్రలు కన్పించాయి. నర్సంపేట టౌన్ సీఐ రమణ మూర్తి, ఎస్సైలు అరుణ్‌కుమార్, రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్, ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకొని పెద్ద పులి ఆనవాళ్లను గు ర్తించారు. నల్లబెల్లి మండలం రుద్రగూడెం శివారులోని కెనాల్ మీదుగా నర్సంపేట మండలం జంగాలపల్లితండా శివారు పంట పొలాల్లోకి వచ్చినట్లు నిర్ధారించారు. అదేవిధంగా నర్సంపేట ఎఫ్ఆర్వో రవికిరణ్ ఆధ్వర్యంలో అటవీ శాఖాధికారులు ఖానాపురం మండలం కీర్యతండా శివారులోని బదావత్ రాములు పొలం వద్దకు వెళ్లి పాదముద్రలను పరిశీలించి, అవి పెద్దపులివేనని నిర్ధారించారు.
నల్లబెల్లి: పులుల సంచారంపై స్పష్టమైన సమాచారంతో ప్రజలకు రక్షణ కల్పించాలని నర్సంపే ట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. నియోజక వర్గంలో పులి సంచరించిన గ్రామాల్లో పాదముద్రలను పరిశీలించారు.
ప్రజలు భయాందోళనకు గురికావొద్దని ఆయా గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. అనంతరం ఎఫ్ఆర్వో, ఫారెస్ట్ అధికారులతో పెద్ది ఫోన్లో మాట్లాడి గూగుల్ మ్యాప్, డ్రోన్ కెమెరాల ద్వారా పులల సంచారాన్ని గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, పీఏ సీఎస్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్‌రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్‌గౌడ్, పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ఊడ్గుల ప్రవీణ్‌గౌడ్, నాయకులు శివాజీ, అమరేందర్‌రెడ్డి, సూరయ్య, అంబరగొండ రాజు తదితరులు పాల్గొన్నారు.