హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 24 : ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో వరంగల్‌లో నిర్వహించే సభకు అనుమతి లేదని అరెస్టు చేయడం సరైంది కాదని, అరెస్టు చేసిన వేదిక నాయులందరినీ వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. 1996 పెసా చట్టం, 2006 అటవీ హక్కుల చట్టం 1/70 గ్రామసభ తీర్మానాలు అమలు కావాలని కోరుతూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక వరంగల్‌లో బహిరంగసభకు 20 రోజులుగా అధికారులతో కలిసి ప్రయత్నాలు చేసిందన్నారు.
చివరికి అధికార పార్టీ, పీసీసీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసి అనుమతికి తీవ్రంగా ప్రయత్నిం చేసిందన్నారు. కానీ, 23న వరంగల్ సీపీ, సుబేదారి సీఐలు సభకు అనుమతి లేదని ప్రకటించి ఒకవైపు సభ జరగనీయకుండా నిర్బంధం అమలు చేయడమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా వేదికలో పనిచేస్తున్న నాయకత్వాలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం సరైంది కాదన్నారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగవ్యతిరేక పరిపాలన విధానంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నున్నా అప్పారావు, సీఎల్సీ ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు, రాష్ట్ర అధ్యక్షుడు జక్కుల వెంకటయ్య, దేశభక్తప్రజాతంత్ర ఉత్యమం చంద్రమౌళి, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ అధికార ప్రతినిధి గంగుల దయాకర్, గిరిజన హక్కుల సంఘం భూక్య శ్రీనివాస్, రాష్ట్ర కన్వీనర్ చైతన్య మహిళా సంఘం కె.శ్రీదేవి, ట్రైబల్ డెమోక్రటిక్ పోరిక ఉదయ్సింగ్నాయక్, రాచర్ల బాలరాజు, గుడికందుల క్రాంతి పాల్గొన్నారు.