ఎల్కతుర్తి, అక్టోబర్ 8 : మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నాలుగు ఇండ్లల్లో దొంగతనం చేసి అడ్డువచ్చిన కుటుంబసభ్యులను చితకబాదారు. సుమారు రూ. 8లక్షల బంగారు ఆభరణాలతో పాటు రూ. లక్షా 5వేల నగదును అపహరించారు. ఎల్కతుర్తి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దామెర గ్రామానికి చెందిన మాడేటి శ్రీలత- లక్ష్మీనారాయణ దంపతులు ఎల్కతుర్తిలో ఇల్లు అద్దెకు తీసుకొని నివసిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 2.45 గంటల ప్రాంతంలో దొంగలు ఇంటి మెయిన్ డోర్‌కు డ్రిల్ మిషన్‌తో రంధ్రం చేసి డోర్ ఓపెన్ చేసి వారు నిద్రిస్తున్న రూములోకి చొరబడ్డారు. శబ్ధానికి నిద్రలేచిన శ్రీలత, లక్ష్మీనారాయణ ఎవరు అని అరుస్తుండగానే కర్రతో లక్ష్మీనారాయణను విచక్షణారహితంగా కొట్టారు.
శ్రీలత ఒంటి మీద ఉన్న 40 గ్రాముల పుస్తెలతాడు, 60 గ్రాముల బంగారు గాజులతో పాటు లక్ష్మీనారాయణకు చెందిన 15 గ్రాముల చెయిన్‌ను లాక్కున్నారు. అలాగే బీరువాలోని 4 గ్రాములు, 16 గ్రాముల చెయిన్లతో పాటు 12 గ్రాముల చెవి కమ్మలు, రూ. 80వేల విలువైన డైమండ్ కమ్మలు, రూ.లక్ష విలువైన ముత్యాల సెట్, రూ.లక్ష నగదు ఎత్తుకెళ్లారు. లక్ష్మీనారాయణ ఇంట్లో దొంగతనం చేసేముందుగానే విద్యానగర్ కాలనీకి చెందిన మాడుగుల ప్రేమయ్య ఇంట్లో కిరాయికి ఉంటున్న బీఫార్మసీ విద్యార్థుల రూము తాళం పగులకొట్టి దొంగతనానికి ప్రయత్నించి ఎవరూ లేకపోవడంతో బట్టలను చిందరవందర చేశారు.
అనంతరం అదే రూము పక్కన కిరాయికి ఉంటున్న కావటి రాజ్‌కుమార్ రూం తాళం పగులకొట్టి 10 గ్రాముల కమ్మలు, చెంగెల్లి శ్రీనివాస్ ఇంట్లో రూ. 5వేల నగదు తస్కరించారు. బాధితులు ఎల్కతుర్తి పోలీసులకు సమాచారం అందించారు. గాయాలపాలైన లక్ష్మీనారాయణను ఆస్పత్రికి తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ బారి, క్రైం డీసీపీ మురళీధర్, క్రైం ఏసీపీ మల్లయ్య, కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజ్, ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై రాజ్‌కుమార్ ఘటనా స్థలాలకు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వివరాలు సేకరించారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే పలుచోట్ల సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో నిందితుల ఆచూకీ లభించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
రెండు హుండీల్లోని కానుకల అపహరణ..
ఖిలావరంగల్ : శివనగర్‌లోని సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగినట్లు ఆలయ కమిటీ తెలిపింది. సుమారు రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆలయ ప్రాంగణంలోని సీసీ కెమెరాలకు బబుల్గమ్ అతికించి తాళాలను కటర్‌తో కట్ చేశాడు. ఆలయంలోని రెండు హుండీలను పగులగొట్టి అందులో ఉన్న సుమారు రూ.2 లక్షలకుపైగా కానుకలను అపహరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.