హనుమకొండ, ఫిబ్రవరి 23: ఎస్సీ, ఎస్టీ సమస్యలు పరిష్కరించడంలో ఎన్పీడీసీఎల్ యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఎదుట మొర పెట్టుకున్నారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని విద్యుత్ భవన్లో సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ రోస్టర్ పాయింట్, బ్యాక్లాగ్ వెకన్సీ సమీక్షకు వెంకట య్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విద్యుత్ సంఘా ల నాయకులు తమ సమస్యలను కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత డైరెక్టర్ హెచ్ఆర్డీ సీ ప్రభాకర్ ఎన్పీడీసీఎల్లో అవలంబిస్తున్న రోస్టర్ పాయింట్, రిక్రూట్మెంట్, బ్యాక్లాగ్ వెకెన్పీపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
2025 సెప్టెంబర్‌లో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, కార్యాచరణ ప్రణాళికను చైర్మన్‌కు వివరించారు. అనంతరం వెంకటయ్య మా ట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో అత్యంత పారదర్శకంగా ఉండాలని, గైడ్‌లైన్స్ ప్రకారమే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయాలని, ఏపీ ఎంప్లాయీస్ ప్రమోషన్ విషయంలో సమస్యలను పరిష్కరించాలన్నారు. విద్యుత్ పల్లెబాట మంచి కార్యక్రమం అని, ప్రతి పల్లెలో మంచి స్పందన వస్తుందని, రూపకల్పన చేసిన సీఎండీని ఆయన అభినదించారు.
మళ్లీ మూడు నెలల్లో సమావేశం నిర్వహిస్తానని, అప్పటి వరకు అన్ని సమస్యలు పరిష్కరించాలని డైరెక్ట ర్ హెచ్ఆర్డీకి సూచించారు. అనంతరం సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ డిపార్ట్మెంట్, మేనేజ్మెంట్ తరఫున ఉద్యోగులకు సంపూ ర్ణ భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తామని పేరొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వీ మోహన్‌రావు, టీ మధుసూదన్, సీ ప్రభాకర్, సీఈలు టీ తిరుమల్‌రావు, టీ సదర్లాల్, మాధవరావు, రాజుహన్, అశోక్, అన్నపూర్ణ, ఎస్సీ,ఎస్టీ అసోసియేషన్ నాయకులు ఆనందం, దాన య్య, ఉపేందర్, సుదర్శన్, మాతంగి శ్రీనివాస్ పాల్గొన్నారు.