కాకతీయ యూనివర్సిటీలో అంతులేని అవినీతి జరుగుతున్నది. విద్యార్థుల భవిష్యత్తులో కీలకమైన పరీక్ష పేపర్ల వాల్యూయేషన్‌లో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. రెగ్యులర్, డిస్టెన్స్.. డిగ్రీ, పీజీ, బీఈడీ, ఎల్ఎల్బీ, ఎంసీఏ, ఏంబీఏ, బీటెక్, ఎంటెక్… పరీక్ష ఏదైనా డబ్బులిస్తే ఆన్సర్ షీట్లను మార్చి సులభంగా పాస్ కావచ్చనేది తాజా ఉదంతంతో బయటపడింది. 2,043 మంది డిగ్రీ జవాబు పత్రాల మార్పిడిలో ఒక్కో పేపర్‌కు రూ.5 వేలు తీసుకున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఔట్సోర్సింగ్ సిబ్బంది అరెస్టులతోనే సరిపుచ్చుతున్నారని, లోతుగా విచారణ జరపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యూనివర్సిటీలో ఆన్సర్ బుక్లెట్లను మార్చిన ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చినా.. ఎప్పటి నుంచో ఇలా జరుగుతున్నది. జవాబు పత్రాలను బయటికి తీసుకెళ్లి అదే బండిల్స్‌లో పెట్టినట్లు సీసీ పుటేజీ ద్వారా పరీక్షల నియంత్రణాధికారి ఎస్. నర్సింహాచారి ఫిర్యాదు మేరకు కేయూ పోలీసులు మాదాసి సునీల్, గడ్డం రాణాప్రతాప్, నాసమ్ శ్రీధర్, బి.పృథ్వీరాజ్, బైరి రమేశ్, చట్ల సందీప్, ఎస్.పవన్‌కుమార్, పొన్నాల నితీశ్, పొలెపాక శ్రీకాంత్, దేవరకొండ రాజేశ్, చీకటి రాకేశ్‌ను అరెస్టు చేశారు. పరీక్షల విభాగంలో పనిచేసే 25 మందితో ఈ వ్యవహారానికి సంబంధం ఉన్నదని తెలుస్తోంది. ఇందులో ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాత్ర నామమాత్రమేనని, ఉన్నతాధికారులే అసలు సూత్రధారులని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల అరెస్టు వ్యవహారంలో ఏకంగా 2,043 మంది ఆన్సర్ షీట్లను మార్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీసుల విచారణలో సైతం ఎంత మంది జవాబు పత్రాలు మార్చారో స్పష్టం చేయడం లేదు. యూనివర్సిటీ ఉన్నతాధికారుల ఒత్తిడితోనే పోలీసులు కచ్చితమైన సంఖ్యను బయటికి తెలియనీయడం లేదనే విమర్శలు ఉన్నాయి.
పరీక్ష విభాగంలో దినసరి వేతన సిబ్బందిని పోలీసులు విచారించిన సందర్భంగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉన్నతాధికారుల సూచన మేరకే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఒక ముఠాగా ఏర్పడి ఈ తతంగం నడిపినట్లు వెల్లడైంది. పరీక్షల విభాగం నుంచి ఆన్సర్ బుక్‌లెట్‌ను బయటకు తీసుకుపోయి డబ్బులిచ్చిన వారితో రాయించి మళ్లీ బండిల్స్‌లో పెడితే ఒక్కో పేపర్‌కు రూ.5 వేలు తీసుకున్నట్లు బయటపడింది. ప్రైవేటు కాలేజీల్లోని పలువురు ఉద్యోగులతో కలిసి యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఈ పనులు చేస్తున్నట్లు తేలింది. అరెస్టయిన వారు ఉన్నతాధికారుల ప్రమేయంపై అధికారికంగా ఎక్కడా చెప్పడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. బెయిల్‌పై బయటికి వచ్చిన తర్వాత మళ్లీ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం వల్లే పోలీసులకు వాళ్లు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
యూనివర్సిటీ పరీక్షల విభాగంలో భారీ అవినీతి కుంభకోణం జరిగింది. కేయూ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ 2, 4, 6వ సెమిస్టర్ పరీక్షలు ఇటీవల ముగిశాయి. వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో యూజీ, పీజీకి చెందిన మొత్తం 25 మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఆన్సర్ బుక్లెట్లు మార్పిడిలో 2,043 మంది ఆన్సర్ షీట్లు ఉన్నట్లు తెలి సింది. ఇవి డిగ్రీ పరీక్షల పేపర్లు మాత్రమేనని.. పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షల్లోనూ ఇదే జరుగుతున్నదని ఆరోపణలు ఉన్నాయి. ఆన్సర్ షీట్ల మార్పిడిలో పైసలు ఇచ్చిన విద్యార్థులు తమ పేరు చెప్పవద్దని ఔట్సోర్సింగ్ సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. తమ పేర్లు చెబితే యూనివర్సిటీలో తాము పైసలిచ్చిన ఉన్నతాధికారుల పేర్లను బయటికి వెల్లడిస్తామని హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఈ వ్యవహారంలో లోతుగా విచారించకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేరుకు కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ అయినా విశ్వవిద్యాలయంలో అవినీతి వ్యవహారంపై లోతుగా విచారణ జరపడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.