నర్సింహులపేట, జనవరి 9: ‘నీ ఇంటి మీటర్ నంబర్‌పై రూ.36వేల బిల్లు ఉంది. చెల్లించకుంటే కరెంట్ తీసేస్తాం అం టూ అధికారులు హెచ్చరించడంతో డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత అది నీ సర్వీస్ నంబర్ కాదని, నీ మీటర్‌పై రూ.1473 7 బాకీ ఉంది’ అని చెప్పడంతో వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ గ్రామానికి చెందిన డొనికెన శ్రీను విద్యుత్ మీటర్ సర్వీస్ నంబర్ 859 అని, దానిపై రూ.36 వేలు బిల్లు చెల్లించాలని ఏఈతో పాటు అధికారులు వచ్చి సర్వీస్ వైర్ తొలగించి ఇబ్బం ది పెట్టారు.
అదే సమయంలో అతడి కూతురు డెలివరీ ఉండడంతో నెల బిల్లుతో పాటు ఫిబ్రవరి నెలలో రూ.5 వేలు చెల్లించాడు. ప్రతి నెల బిల్లుతో పాటు సెప్టెంబర్ వరకు రూ.36 వేలు చెల్లించాడు. ఆ తర్వాత గృహజ్యోతి కోసం ఎంపీడీవో, విద్యుత్ అధికారి కార్యాలయం చుట్టూ తిరగగా మూడు నెలలుగా జీరో బిల్లు వచ్చింది. ఆ సంతోషం కాస్తా కొత్త సంవత్సరం వరకే ఉ న్నది. ఆ తర్వాత నీ మీటర్ సర్వీస్ నంబర్ 859 కాదని, 977 అని, దీనికి రూ.14,737 బిల్లు చెల్లించాలని విద్యుత్ ఏఈ చెప్పాడు. బిల్లు చెలిస్తే నీకు గృ హజ్యోతి వస్తుందని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని శ్రీను వాపోయాడు. అధికారుల తప్పిదంతో తన దగ్గర రూ. 36 వేలు వసూలు చేసి పది మందిలో ఇజ్జత్ తీసి పైసలు కట్టించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ బిల్లు జయపురం గ్రామానికి చెందిన శ్రీను మీటర్ నంబర్ అని చెప్తున్నారని, మళ్లీ పైసలు కట్టమంటున్నారని, ఉన్నతాధికారులు న్యాయం చేయాలని కోరాడు.