కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరం గ్రామం శివారులోని వాగులో కరెంటు మోటర్లు దొంగిలించినట్లు రైతులు సోమవారం తెలిపారు. కొంతకాలంగా దొంగలు వాగుకు పెట్టుకున్న కరెంటు మోటర్లను ఎత్తుకెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్లు దొంగిలించిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దొంగలను పోలీసులు పట్టుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికే రెండుసార్లు 20 కరెంటు మోటర్లు దొంగలు ఎత్తుకెళ్లడంతో తీవ్రంగా నష్టపోయామని చెప్పారు.
వేసవికాలం కావడంతో గ్రామపంచాయతీ ఏర్పాటుచేసిన కరెంటు మోటర్ ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు కార్యదర్శి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. లక్ష్మీపూర్ గ్రామం ప్రజలు చందాలు వేసుకొని కరెంటు మోటరు కొనుగోలు చేసి ఇచ్చారని చెప్పారు. తాగునీటి కోసం వాగులో పెట్టిన మోటర్ ను దొంగలు ఎత్తుకెళ్లడంతో గ్రామానికి తాగునీటి సరఫరా నిలిచిపోయినట్టు తెలిపారు. కరెంట్ మోటర్ల దొంగతనంపై రెండోసారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు.