హనుమకొండ సబర్బన్, ఫిబ్రవరి 4 : వేసవి ప్రారంభం కాకముందే భానుడు భగభగమంటున్నాడు. రోజు రోజుకూ ఎం డలు పెరుగుతుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రెండు రోజుల క్రితం వరకు వణికించిన చలి మారిన వాతావరణంతో ఒక్కసారిగా మాయమైంది. దీంతో కాస్త ఊపిరిపీల్చుకున్న జనం మంగళవారం మాడ పగిలే ఎండ తగలడంతో బెంబేలెత్తిపోయారు. ఇప్పుడే ఇలా ఉంటే.. రానున్న రోజుల్లో ఇంకా ఎలా ఉండబోతుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే రాత్రి వేళ కొంత చలిగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండ అధికంగా ఉంటున్నది. నాలుగు రోజుల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఈ నెల 1న కనిష్ఠంగా 19, గరిష్ఠంగా 32 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 2న 19, 34, 3న 18, 35, ఇక 4న కనిష్ఠంగా 17.5, గరిష్ఠంగా 36 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి.
రోజుకొక డిగ్రీ చొప్పున ఎండలు పెరుగుతుండడంతో ప్రజలు బయట తిరగలేకపోతున్నారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. వివిధ పనుల నిమిత్తం బయటకు వస్తున్న వారు సైతం ఎండ నుంచి రక్షణ పొందేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బోండాలు, శీత ల పానీయాలు తాగుతున్నా రు. వ్యవసాయ బావుల్లో ఒక్కసారిగా నీటి ఊటలు తగ్గిపోవడంతో యాసంగి పంట ఎలా పూర్తవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే మొన్నటి వరకు తేనె మంచు ప్రభావానికి గురైన మామిడి తోటలకు మారిన వాతావరణం లాభం చేకూర్చనుందని యజమానులు భావిస్తున్నారు.