నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. ఇండ్ల పై కప్పులు లేచిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం, నిల్వ చేసిన డే మృతిబస్తాలు తడిసిముద్దయ్యాయి. రేగొండ మండలం గూడెపల్లెకు చెందిన నారాయణ, గుండు రవి, కొడవటంచకు చెందిన కోడెపాక రాజయ్య ఇండ్లపై చెట్లుపడి కూలిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు నిరాశ్రయులయ్యారు. లింగాలలో పిడుగుపడి ఒకరు మృతిచెందారు.
గ్రామానికి చెందిన తిప్పారపు రాజు(32) రోజు మాదిరిగానే మంగళవారం వ్యవసాయ బావి వద్దకు కాడెద్దులను తీసుకొని వెళ్లాడు. ఎడ్లను మేత కోసం చెట్టు కింద కట్టేశాడు. సాయంత్రం ఈదురుగాలులతో వర్షం కురవడంతో రాజు ఎడ్లను తీసుకొస్తుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్యతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో చిరుజల్లులు కురవగా, మార్కెట్ కార్యదర్శి మల్లేశం, అధికారులు మైకుల ద్వారా రైతులను అప్రమత్తం చేశారు.

ఆపరాలయార్డు, మిర్చియార్డులోని మిర్చి బస్తాలపై టార్పాలిన్లు కప్పి కాపాడుకున్నారు. అకాల వర్షంతో నడికూడ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం, మక్కలు, మిర్చి తడిసిముద్దయ్యాయి. శాయంపేట మండలం అప్పయ్యపల్లి శివారులోని కటాక్షపూర్ ప్రధాన రహదారి పక్కనున్న వందేళ్ల మర్రి చెట్టు నేల కూలింది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులు ఆగమాగమయ్యారు. ధాన్యం రాశులపై టార్పాలిన్లు కప్పుకొని కాపాడుకునే ప్రయత్నం చేశారు. చిట్యాల, టేకుమట్ల మండలాల్లో బలమైన గాలులు వీచాయి. ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయింది.

