ఖిలావరంగల్, ఫిబ్రవరి 23 : బీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఖిలావరంగల్ మండలంలోని విలీన గ్రామాలకు చెందిన 11మంది లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. యావత్ దేశం సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని తెలిపారు. సమృద్ధిగా సాగు నీరు అందిస్తున్నందు వల్లే దేశ రైతులు తెలంగాణ వైపు చూస్తున్నారన్నారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, అన్ని రంగాల్లో విఫలమవుతున్న బీజేపీకి బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయం అని స్పష్టం చేశారు.
గీసుగొండలో..
గీసుగొండ : పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ, సంగెం గ్రామాలకు చెందిన 39 మందికి రూ.14లక్షల 5వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను హనుమకొండలోని తన నివాసంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. దేశంలో కేసీఆర్ పాలన వస్తుందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సుంకరి మనీషా, మనోహర్, బాబు పాల్గొన్నారు.
వైభవంగా సుదర్శన యాగం..
గీసుగొండ : కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి ఆలయ తూర్పు ముఖద్వారం వైపు దాతల సహకారంతో సేకరించిన రూ. 80 లక్షలతో నిర్మించిన 65 అడుగుల రాజగోపురం ప్రారంభోత్సవం వైభవంగా సాగుతున్నది. గురువారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సుదర్శన యాగానికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు హాజరయ్యారు. రాజగోపురాన్ని త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి ప్రారంభిస్తారని, అనంతరం భూనీలాదేవి సమేత లక్ష్మీనర్సింహస్వామి కల్యాణ వేడుకలు జరుగుతాయని దాతల సమన్వయ కన్వీనర్ కోనె వెంకటగిరి కోరారు.
హాజరుకానున్న మంత్రి ఎర్రబెల్లి..
లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన రాజగోపురం ప్రారంభోత్సవానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజ్ సారయ్య, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొంటారని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వీరగోని రాజ్‌కుమార్ తెలిపారు.