‘బీసీ రిజర్వేషన్ల విషయంలో దగా చేస్తే తడాఖా చూపిస్తాం.. పదేండ్ల క్రితం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బలహీన వర్గాలు 52% అని తేలితే, ఇప్పుడు 46% ఎలా అయితరు?.. 21 లక్షలు తగ్గించి చూపి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిం ది. అగ్రవర్ణాల రిజర్వేషన్లను కాపాడేందుకే బీసీల సంఖ్యను తగ్గించి చూపించారు. లెక్కల తేడాలో ఉన్న అనుమానాలను సర్కారు నివృత్తి చేయకుండా మొండి వాదనకు దిగుతున్నది. కుల గణన ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తాం.. నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు చెప్పడాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సర్వేతో వారికి మరింత అన్యాయం జరుగుతుంది. ఈ విషయంపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తాం. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి. బీసీ డిక్లరేషన్ మేరకు సమగ్ర కులగణన వివరాలను వెల్లడించి రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. లేదంటే బీసీల ఉద్యమంతో గాలికి కొట్టు కుపోతది’ అని వివిధ బీసీ, వివిధ కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
– నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 7
జనగామ చౌరస్తా : కుల గణన సర్వే పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. సర్వే పూర్తికాకుండానే బీసీల సంఖ్యను ప్రకటించింది. అందులోని 134 కులాల్లో ఏ కులం వారు ఎంత జనాభా ఉన్నారనే లెక్కలు చెప్పలేదు. గత సీఎం కేసీఆర్ ఒక్కరోజులో చేసిన సర్వేలో బీసీల సంఖ్య పెరిగింది. కానీ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన సర్వేలో బీసీల సంఖ్య లక్షల్లో తగ్గిందని స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ లెక్కల తేడాతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు అనుమానం కలుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.
– ఏనుగుతల యాదగిరి, కుమ్మర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జనగామ
హనుమకొండ: బీసీలకు అన్యాయం చేయడమే సా మాజిక న్యాయమా? కుల గణనతో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. 2015 లో రాష్ట్రంలో బీసీలు 51.1 శాతంగా ఉంటే, ఇప్పుడు 46.25 శాతమని లెక్కలు చెబుతున్నరు. అప్పుడు బీసీలు 1.88 కోట్లుగా ఉంటే ప్రస్తుత సర్వేలో 1.64 కోట్లుగా చూపిస్తున్నారు. పదేళ్ల తర్వాత జనాభా ఎందుకు తగ్గింది అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు. 2011 జనాభా లెకల ప్రకారం రాష్ట్ర జనాభా 3.51 కోట్లుగా ఉంటే, ప్రతి సంవత్సరం1.3 శాతం జనాభా పెరిగితే 4.20 కోట్లకు చేరుకుంటుంది.
కానీ కుల గణన రిపోర్టులో 3.54 కోట్లుగా చూపించడం అంటే 60 నుంచి 70 లక్షల జనా భా సర్వే పరిధిలోకి రాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 3.35 కోట్ల ఓటర్లు ఉంటే కుల గణన రిపోర్టు ప్రకారం జనాభా 3.54 కోట్లుగా చూపిస్తున్నారంటే ఓటర్లుగా నమోదు కాని వారు రాష్ట్రంలో కేవలం 19 లక్షలే ఉన్నారా?, అందుకే సర్వే రిపోర్ట్ అశాస్త్రీయంగా ఉందనే భావన వ్యక్తమవుతున్నది. అగ్రవర్ణాల్లో ఒక సామాజిక వర్గం జనాభాని 17 లక్షలుగా చూపించారనే ఆరోపణలు ఉన్నాయి. కులగణన రిపోర్టులో బీసీలకు జరిగిన అన్యాయంపై రాహుల్ గాంధీకి లేఖ రాస్తాం.
– డాక్టర్ తిరుణహరి శేషు, బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్
కాజీపేట: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన కుల గణన సర్వేలో శాస్త్రీయత లేదు. పదేండ్ల క్రితం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 52% అని తేలగా, ఇప్పుడు 46%కు ఎట్లా తగ్గుతారో చెప్పాలి. సర్వేలో అవకతవకలు జరిగాయి. బీసీలను అన్ని విధాలా అణగ దొక్కేందుకు కావాలనే తప్పుడు రిపోర్టు ఇచ్చారు. బీసీ జనాభాను 21 లక్షలు తగ్గించి చూపడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టుకాక తప్పదు. 2014లో ఓసీల జనాభా 8% ఉంటే, ప్రస్తుతం 15% ఎలా పెరుగుతుంది. వారు పెరిగినప్పుడు బీసీలు ఎందుకు పెరుగలేదో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి లేదు. కేవలం కుల గణన చేసినట్లు చేతులు దులుపేసుకునేందుకు ప్రభుత్వం తప్పుడు సర్వే చేయించింది.
– మేకల కేదారి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు
ఖిలావరంగల్: కాంగ్రెస్ పార్టీ నాయకులు నాటి నుంచి బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరికొకరికి సంబంధం లేకుండా మాట్లాడుతూ బీసీలను అవమానిస్తున్నారు. అంబేద్కర్, బీపీ మండల్ త్యాగ ఫలితంగా రిజర్వేషన్లు అనుభవిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ బహుజన ఉద్యోగ, ఉపాధ్యాయులు అందరు ఏకమై పోరాటాలు చేయాలి. తెలంగాణ ఉద్యమం తరహాలో మరోసారి బీసీలు తమ గళం విప్పాలి.
-కేడల ప్రసాద్, పూలే సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు