వివిధ వర్గాలకు చెందిన వారిలోని సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభు త్వం ఏటా ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఏ వృత్తిలో ఉన్నా.. కొత్త ఆలో చనలు ఉన్న వారు ఇందులో పాల్గొనే అవకాశం ఉంది. తమ ఆలోచనలకు సృజనాత్మకతను జోడించి పూర్తి వివరాలతో ప్రయోగాలను ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నెల 25వ తేదీ వరకు గడువు ఉండగా, ఆగస్టు 15న జిల్లాస్థాయిలో ఆవిష్కరణలను ప్రదర్శిస్తారు. వీటిలో ఉత్తమమైన వాటికి ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతులను అందజేయనున్నది.
– భూపాలపల్లి రూరల్, జూలై 2
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్నదాతలు, విద్యావేత్తలు, విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు, గృహిణులు.. ఇలా ఎవరైనా ఆవిష్కరణలు చేయవచ్చు. వాటిని ఆగస్టు 15వ తేదీన(స్వాతంత్య్ర దినోత్సవం) ప్రదర్శిస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికైన వాటికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహక బహుమతితో పాటు మార్కెటింగ్ చేసుకోవడానికి అనుమతినిచ్చింది.
స్థానిక సమస్యలే లక్ష్యంగా..
మన చుట్టుపక్కల, ఇళ్ల్లు, విద్యాలయాలు, వ్యవసాయం, ఇతర రంగాల్లో నిత్యం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఆవిష్కరణలు చేయాలి. ఇప్పటికే ఉన్న వస్తువుల్లో కొన్ని మార్పులు చేసి కొత్త వాటిని రూపొందించవచ్చు. ఆవిష్కరణ అనేది అందరి మెప్పు పొందేలా ఉండాలి.
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి..
ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో పాల్గొనడానికి https://www.teamtsic.org వెబ్సైట్ ద్వారా ఈ నెల 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆవిష్కరణల వివరాలను ఆగస్టు 5వ తేదీలోగా వాట్సాప్ నెంబర్ 910067843కి పంపాలి. అందులో ఆవిష్కరణకు సంబంధించి ఆరు వాక్యాల వివరణ ఉండాలి. రెండు నిమిషాల నిడివి వీడియో, నాలుగు ఫొటోలు తీసి పంపా లి. ఆవిష్కరణ పేరు, సెల్‌ఫోన్ నెంబర్, వయస్సు, ప్రస్తుత వృత్తి, గ్రామం, జిల్లా పేరు రాయాలి.
సద్వినియోగం చేసుకోండి
ప్రతి వ్యక్తిలో దాగి ఉన్న ఆలోచనలను వెలికితీసి వాటిని ఆవిష్కరణలుగా మార్చి సమాజంలోని సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్, కళాశాలల విద్యార్థులు, గృహిణులు, రైతులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారు ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ నెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంపై ఎలాంటి సందేహాలు ఉన్నా జిల్లా సైన్స్ అధికారి బీ స్వామి 8555045517 నంబర్‌ను సంప్రదించండి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి.
– ఎన్ రాంకుమార్, డీఈవో, జయశంకర్ భూపాలపల్లి