తెలంగాణలో పచ్చదనం పెంపే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. ఈ ఏడాది వరంగల్ జిల్లాలో 19.64లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్దేశించింది. రైతులకు అదనపు ఆదాయం సమకూర్చేందుకు సర్కారు ఈ దఫా మునగ మొక్కలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. మొత్తం మొక్కల్లో పది శాతం ఉండేలా ప్రణాళిక రూపొందించి ప్రతి నర్సరీలో వెయ్యి మునగ మొక్కలు పెంచుతున్నది. ఈ లెక్కన జిల్లాలోని మొత్తం 323 నర్సరీల్లో 3.23 లక్షలకుపైగా మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి.
వరంగల్, మే 21(నమస్తేతెలంగాణ): తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా ఈ ఏడాది జిల్లాలో 19.64 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అధికారులు గ్రామ పంచాయతీల నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టారు. ప్రతి నర్సరీలో పది వేల మొక్కలను పెంచుతున్నారు. వీటిలో పదిశాతం మునగ మొక్కలు ఉండడం ఈసారి హరితహారం కార్యక్రమం స్పెషల్. దేశంలో మరే రాష్ట్రంలో లేని రీతిలో పచ్చదనం పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. పండుగ వాతావరణంలో ఉద్యమంలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ, రహదారులకు ఇరువైపుల అధికారులు మొక్కలను నాటుతున్నారు.
పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి నీడనిచ్చే, పండ్లు, పూల మొక్కలను పంపిణీ చేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఆయా గ్రామం, పట్టణం, నగరంలో పచ్చదనం పరుచుకుంది. గతంలో తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా నర్సరీల్లో ప్రభుత్వం పెద్ద సంఖ్యలో టేకు మొక్కలను రైతులకు పంపిణీ చేసింది. వీటిని రైతులు తమ పొలం గట్లపై నాటారు. తద్వారా వీరికి అదనపు ఆదాయం సమకూరుతున్నది. ఈసారి రైతులకు ఆదాయం, ప్రజలకు ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే మునగ మొక్కలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టార్గెట్లో పదిశాతం ఈ మొక్కలను పెంచాలని ఆదేశించింది. దీంతో నర్సరీల్లో ఈ ఏడాది పెంచే పది వేల మొక్కల్లో పది శాతం మునగ మొక్క లు ఉండేవిధంగా అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రతి నర్సరీలో ప్రత్యేకంగా ఒక మడిలో వెయ్యి మునగ మొక్కల పెంపకం చేపట్టారు. మునగ మొక్కలు నాటిన తర్వాత మూడో నెల నుంచి రైతులకు దిగుబడి రానుంది.
దీంతో రైతులకు ఆదాయం సమకూరనుంది. వానకాలం జిల్లాలోని 323 నర్సరీల నుంచి 3.23 లక్షల మునగ మొక్కల పంపిణీ జరుగనుంది. మునగ సహా జిల్లాలోని నర్సరీల్లో 19,63,800 మొక్కలను ప్రభుత్వం పెంచుతున్నది. వీటికితోడు గత సంవత్సరానికి సంబంధించిన మొక్కలు 13,59,850 నర్సరీల్లో ఉన్నాయి. ప్రస్తుతం మొత్తం 33,97,010 మొక్కలు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం మొక్కలను ఎవెన్యూ ప్లాంటేషన్ కోసం ఉపయోగించేందుకు ప్లాన్ చేశారు. నర్సరీల్లో ఈసారి మునుపెన్నడూ లేని రీతిలో చాలారకాల నీడనిచ్చే, పండ్లు, పూల రకాల మొక్కలను ప్రభు త్వం పెంచుతున్నది. డీఆర్డీవో సంపత్రావు జిల్లాలోని నర్సరీలను సందర్శించి మొక్కల పెంపకంపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.