వరంగల్, జూన్ 28 : కోట్లు ఖర్చు చేసినా లక్ష్యం చేరుకోవడం లేదు. భద్రకాళీ చెరువు పూడికతీత పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికింతే అన్నట్లుగా పనులను నిలిపివేశారు. రూ. 16 కోట్లు వెచ్చించి చేపట్టిన 7.76 లక్షల క్యూబిక్ మీటర్ల చెరువు పూడికతీత పనులపై అధికార యంత్రాంగం చేతులేత్తేసింది. ఇంకా సుమారు 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీయాల్సి ఉంది. వారం రోజులుగా చెరువు పూడికతీత పనులకు కాంట్రాక్టర్ పక్కన పెట్టారు. మిగిలిన పనులు ఇప్పట్లో చేపట్టేది లేదని అధికారులు చెబుతున్నారు. ఈ వానకాలం నాటికి భద్రకాళీ చెరువు పూడికతీత పనులు పూర్తి చేసి వర్షపు నీటితో నింపి జలకళ తీసుకొస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలయ్యాయి. దీనికి తోడు తొలగించిన మత్తడి ప్రాంతంలో చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. చెరువులోకి వచ్చిన నీరు బయటకు వెళ్లకుండా మత్తడిపై ఇంకా గేట్లు ఏర్పాటు చేయలేదు. అసంపూర్తి పనులతో భద్రకాళీ చెరువు పరిస్థితిని చూసి నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఆగిన పూడికతీత..
భద్రకాళీ చెరువు పూడికతీత పనులు పూర్తిగా నిలిచి పోయాయి. ఏడాదిన్నర క్రితం చేపట్టిన తొలి విడుత పనుల్లో సుమారు 16 లక్షల క్యూబిక్ మీటర్లకు కుడా ఆధ్వర్యంలో 3 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీశారు. ఈ మట్టితో మాడవీధుల కోసం కట్టను నిర్మించారు. మిగతా 5 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు మట్టిని ఇతర కాంట్రాక్టర్లు తీసుకెళ్లారు. గత ఏడాది ముందస్తు వర్షాలతో పనులు పూర్తి కాకుండానే నిలిపివేశారు. రెండో దశలో చేపట్టిన 7.76 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పనులు వారం రోజుల కిత్రం మళ్లీ నిలిపివేశారు. మరో 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికతీత పనులు మిగిలి ఉండగానే చేతులెత్తేశారు.
బొందివాగు వైపు మొదలు కాని పనులు..
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నగర వరద ముంపునకు శాశ్వత పరిష్కారం కోసం రూ. 158 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశారు. అండర్ రైల్వేగేట్, వరంగల్ వైపు నుంచి వచ్చే వరదను బొందివాగు నాలా నుంచి భద్రకాళీ చెరువులోకి మళ్లించేందుకు, ఇందుకోసం ఎనిమిది వెంట్లు నిర్మించాలని నిర్ణయించారు. నిధులు మంజూరైనప్పటికీ టెండర్ల సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచి పోయింది. ఎన్నికల తర్వాత వచ్చిన కాంగ్రెస్ సర్కారు ఈ పనులను ముందుకు తీసుకుపోవడంలో విఫలమైంది. బొందివాగు వైపు వెంట్ల నిర్మాణాలను రెండేళ్లుగా మొదలు పెట్టలేదు.
మత్తడి వద్ద మట్టి కట్ట..
భద్రకాళీ చెరువు మత్తడికి అడ్డంగా ఇరిగేషన్ అధికారులు తాత్కాలికంగా మట్టి కట్టను ఏర్పాటు చేశారు. చెరువు పూడికతీత పనుల్లో భాగంగా తొలగించిన మత్తడి స్థానంలో నిర్మించిన ఎనిమిది వెంట్లకు ఇప్పటికీ గేట్లు ఏర్పాటు చేయలేదు. దీంతో వానకాలంలో చెరువులోకి చేరే వరద నీరు నిల్వ ఉండేందుకు మట్టికట్టను నిర్మించారు. గతేడాది గేట్లు లేకపోవడంతో చెరువులోకి చేరిన వరదంతా బయటకు రావడంతో నగరంలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. మళ్లీ ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.