సర్కారు వైద్యానికి బీమారీ పట్టుకుంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దవాఖానల్లో వసతుల లేమి, వైద్యుల కొరతతో నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. సీజనల్ వ్యాధులతో హాస్పిటళ్లు కిక్కిరిసిపోతుండగా, ఓపీ చిట్టీల కోసం పడిగాపులు పడే దుస్థితి నెలకొంది. వైద్యులు రాసిన సగం మందులు మాత్రమే దొరుకుతుండగా మిగతావి మెడికల్ షాపుల్లో బోలెడు డబ్బులు పెట్టి కొనాల్సి వస్తున్నది. టెస్ట్ రిపోర్డుల కోసం మూడు రోజులు పడుతుండగా, విధి లేని పరిస్థితుల్లో బయట ప్రైవేట్‌లో చేయించుకోవడంతో ఆర్థికంగా ఇబ్బంది అవుతున్నది.
– జయశంకర్ భూపాలపల్లి/ ములుగు/ మహబూబాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ)/ వరంగల్ చౌరస్తా
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీజనల్ వ్యాధులతో ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నా రు. అక్కడ వైద్యులు, సిబ్బంది కొరతతో జిల్లా ప్రధాన ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. దీంతో మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వస్తున్నారు. జిల్లాలో 13 ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బ పీహెచ్సీ ఉంది. చిట్యాల, మహదేవపూర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. అన్ని పీహెచ్‌సీల్లో ఏఎన్ఎంల కొరత ఉంది.
ఇప్పటి వరకు 42 డెంగ్యూ, 6 మలేరియా కేసులు నమోదయ్యాయి. జిల్లా ఆసుపత్రిలో రోజుకు 1000 మంది, చిట్యాల సీహెచ్‌సీలో 120, మహదేవపూర్ సీహెచ్‌సీలో 200-250 ఓపీ కేసులు నమోదవుతున్నాయి. హాస్పిటల్లో సీబీపీ పరీక్షలు నిలి చిపోయాయి. కిడ్నీ, లివర్, బయో కెమిస్ట్రీ తదితర టెస్ట్‌లకు జిల్లా ప్రధాన ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. హాస్పిటల్లో మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్, రక్త నిధి కేంద్రం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. చిట్యాల సీహెచ్‌సీలో 8 మంది డాక్టర్ల కొరతతో ప్రజలు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
పిల్లలు, స్త్రీల వైద్యులు, ఆర్థో తదితర వైద్యులు లేకపోవడంతో జిల్లా ఆసుపత్రికి పం పిస్తున్నారు. దీంతో పేషెంట్ల రద్దీ పెరుగుతున్నది. ఇక్కడ కూడా పూర్తిస్థాయిలో పరీక్ష లు అందకపోవడం, పలు విభాగాల్లో వైద్యులు లేకపోవడంతో ఎంజీఎం, మెటర్ని టీ హస్పిటళ్లకు రెఫర్ చేయక తప్పడం లేదు. ముఖ్యంగా మహిళలు ప్రసవం కోసం భూపాలపల్లి, హనుమకొండకు వెళ్లాల్సి వస్తున్నది.
ఓపీ చిట్టీల కోసంలైన్లు
ములుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ఓపీ చిట్టీల కోసం పేషెంట్లు క్యూలో అవస్థలు పడుతు న్నారు. అనంతరం వైద్యుడి వద్దకు వెళ్లాలంటే, రక్త పరీక్షలకు, మందులకు లైన్లు కట్టాల్సిందే. ఇన్పే షెంట్ల సంఖ్య పెరగడంతో ఒకే బెడ్‌పై ఇద్దరు
చిన్నారులకు వైద్యం అందించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుత సీజన్లో దవాఖానకు రోగుల తాకిడి పెరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రోజుకు 600-650కి పైగా ఓపీ నమోదవుతున్నది.
గడిచిన వారం రోజుల్లో 4882మంది ప్రభు త్వ దవాఖానకు వచ్చి ఓపీ సేవలు పొందినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇందులో ఎక్కువగా జ్వరం, మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా వంటి వైద్యులతో బాధపడుతున్న వారే ఉ న్నారు. ల్యాబ్ రిపోర్టులు టీ హబ్ కేంద్రం వద్ద ఇస్తుండగా రిపోర్టుల కోసం నిరీక్షించాల్సి వస్తున్నది. జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 46 మలేరియా కేసులు , 58 డెంగ్యూ, 226 టైఫాయిడ్ పాజిటివ్, 82 డయేరియా కేసులు నమోదు కాగా, సాధారణ జ్వరాలతో జిల్లా వ్యాప్తంగా 3238 మంది చికిత్స పొందినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ఎంజీఎంహెచ్‌లో నిండిపోతున్న పడకలు
ఎంజీఎం హాస్పిటల్లో జ్వర బాధితులతో 1500 పడక లు నిండిపోయాయి. అవి సరిపడక పోవడంతో మెడికల్, ఆర్థో, తదితర వార్డులతో పాటు అన్ని వార్డులలో ఖాళీగా ఉన్న బెడ్లను వారికే వినియోగిస్తున్నారు. నిత్యం 2000 మంది వరకు ఓపీ సేవల కోసం వస్తుండగా, ఎక్కువగా సాధారణ, విష జ్వరాల బాధితులే ఉంటున్నారు.
అగస్టు నెల మొదటి నుంచి ఎంజీఎంహెచ్‌లో 3334 మంది సాధారణ జ్వరాలు, 223 మం ది డెంగ్యూ, 39 మంది మలేరియాతో చికిత్స పొందారు. వాతావరణ మా ర్పుల మూలంగా తీవ్ర జ్వరం, శ్వాస సంబందిత బాధితులు 357 మంది రోగులు చికిత్స తీసుకున్నారు. సుమారు 50 మంది తీవ్ర వాంతు లు, విరోచనాల లక్షణాలతో కూడిన డయేరియా బాధితులు ఎంజీఎంహెచ్‌లో చికిత్స పొందారు. ఇతరత్రా విషజ్వరాలతో 2913 మంది బాధితులు 40 రోజుల్లో చికిత్స పొందినట్లు వైద్యాధికారులు తెలిపారు.
360 పడకల ఆసుపత్రిలో అన్నీ సమస్యలే..
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 360 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ నుంచి వైద్యం చేయిం చుకునే వరకు రోగులు అవస్థలు అన్నీఇన్నీ కావు. అక్కడ పరిసరాలు కంపు కొడుతున్నాయి. జ్వరాల సీజన్ కావడంతో పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. దవాఖానలో ఎముకలు, గుండె, న్యూరో తదితర డాక్టర్లు లేకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. ఓపీ చిట్టి కావాలంటే రోగులు గంటసేపు నిరీక్షించక తప్పడం లేదు. డాక్టరు పరీక్షించిన తర్వాత టెస్ట్‌ల కోసం కనీసం మూడు రోజులు పడుతుందంటున్నారు. ఇక్కడికన్నా ప్రైవేట్ ఆసుపత్రికి పోవడం మేలంటున్నారు. డాక్టర్లు రాసిచ్చిన చిట్టీతో వెళ్తే అందులో సగం మందులు మాత్రమే రోగులకు ఇస్తున్నారు. మిగిలిన సగం మందులు ప్రైవేట్ షాపుల్లో కొనుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు.
మూడు రోజులుగా తిరుగుతున్నా
సీబీపీ పరీక్షల కోసం మూడు రోజులుగా తిరుగుతున్నా. మారుమూల ప్రాంతానికి మహదేవపూర్ ఆసుపత్రే పెద్ద దిక్కు. ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. వైద్యులు ఉండ రు. పరీక్షలు చేయరు. ఆసుపత్రి పరిసరాలు, మరుగుదొ డ్లు కంపుకొడుతున్నాయి. కొంచం పెద్ద రోగం వస్తే భూపాలపల్లికి పంపిస్తారు. ఆసుపత్రిపై అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. కలెక్టర్ దృష్టిసారించి పేదలకు వైద్య చికిత్స లు అందుబాటులోకి తీసుకురావాలి.
– ముసీర్ అహ్మద్, మహదేవపూర్
అడ్మిట్ చేసుకోవడం లేదు
నాకు వారం రోజుల నుంచి తీవ్రంగా జ్వరంతోపాటు వాంతులు, విరేచనాలు అవుతున్నాయి. మొన్న ఒకరోజు వస్తే మందులు ఇచ్చినా తగ్గలేదు. మళ్లీ వచ్చిన. నాకు చేత కావడం లేదు అడ్మిట్ చేసు కోమంటే చేసుకుంటలేరు. రక్త, మూత్ర పరీక్ష రిపోర్టు వచ్చినంక జాయిన్ చేస్తమంటున్నారు. నేను పని చేసుకుంటే బతికేవాడిని. నన్ను ఇన్ని సార్లు తిప్పించడం బాగాలేదు.
– భూక్యా హరిలాల్, మేస్త్రి,రంగాపురం, కేసముద్రం
సగం మందులే ఇచ్చారు
నాలుగైదు రోజులుగా ఒకటే ఒళ్లు నొప్పులు, కాళ్లు గుంజుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెండు రోజుల క్రితం వచ్చిన. మంది బాగా ఉండడంతో ఓపీ చిట్టి దొరకక ఇంటికి తిరిగి వెళ్లిపోయిన. మళ్ల ఇయ్యాల వచ్చిన. లైన్ల నిల్చుంటే ఓపీ చిట్టి దొరికింది. డాక్టర్ చూసి నాలుగు రకాల మందులు రాసిండు. ఇందులో రెండు ఇచ్చిన్రు. మిగితావి బయట కొనుకోమంటున్నరు. చేసే దేమీ లేక ఇచ్చినది తీసుకుపోతున్న.
– బానోత్ గమిలి, కేసముద్రం