పోచమ్మమైదాన్, జూలై 31 : ఉమ్మడి వరంగల్‌లో భారీ వరదలు వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు తెగించి, బాధితులకు సేవలు అందించారని వరంగల్ డీఎఫ్‌వో తరంగం వెంకన్న తెలిపారు. వరంగల్‌లోని అగ్నిమాపక కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన 52 మంది సిబ్బందితో పాటు కరీంనగర్, చర్లపల్లి, మౌలాలి సిబ్బంది భాగస్వామ్యంతో వరద బాధితుల కోసం ఇంప్లేటబుల్ బోట్స్, రెస్క్యూ ట్యూబ్స్, లైఫ్ బ్యాగ్స్, ఫ్లోటర్ త్రీ బ్యాగ్స్, లైఫ్ జాకెట్స్, త్రో బ్యాగ్స్, తాళ్లు తదితర వాటిని ఉపయోగించి 609 మంది ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు. రెస్యూ ఆపరేషన్‌లో పాలుపంచుకుని ప్రజల ప్రాణాలను కాపాడి ప్రశంసాపత్రాలను అందుకున్నామని తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు జరిగిన వరద సహాయక కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక శాఖ వరంగల్, హనుమకొండ, పరకాల అగ్నిమాపక కేంద్రాల పరిధిలో సేవలందించినట్లు వివరించారు.
నగరంలోని బీఆర్ నగర్, శాకరాసి కుంట, పుప్పాల గుట్ట, హంటర్‌రోడ్డు, సీఎస్ఆర్ గార్డెన్, భగత్‌సింగ్ నగర్, నయీంనగర్, అశోక్‌నగర్, రాంనగర్, ములుగు రోడ్డు, కాపువాడ, రంగంపేట, సంతోషిమాత కాలనీల్లో వరదల్లో చిక్కుకొన్న ప్రజలను ఇతర శాఖలతో కలిసి రక్షించామని పేర్కొన్నారు. డీజీ ఫైర్ సర్వీస్ ఆదేశానుసారం హైదరాబాద్ నుంచి వచ్చిన రెండు బోట్స్, కరీంనగర్ నుంచి వచ్చిన బోట్‌ను ఇప్పటికీ సిద్ధంగా ఉంచామని తెలిపారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి అగ్నిమాపక సిబ్బంది అలర్ట్‌గా ఉన్నారని వివరించారు. అగ్నిమాపక సిబ్బంది సేవలను గుర్తించి మంత్రి దయాకర్‌రావు ప్రశంసా పత్రాలను అందజేశారని తెలిపారు. ఫైర్ సర్వీస్ డీజీ వై నాగిరెడ్డి, రీజినల్ ఫైర్ ఆఫీసర్ బీ హరినాథరెడ్డి, వరంగల్, హనుమకొండ కలెక్టర్ల ఆదేశానుసారం రెస్క్యూ ఆపరేషన్‌లో వరంగల్ ఈడీఎఫ్వో కే జయపాల్‌రెడ్డి, ఎస్ఎఫ్వో ఏ శ్రీనివాసరావు, హనుమకొండ ఎస్ఎఫ్వో ఏ నాగరాజు, మౌలాలి ఎస్ఎఫ్వో కే రామకృష్ణారెడ్డి పాల్గొన్నారని వివరించారు.