రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో ఉద్యమంలా సాగుతున్నది. ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్నది. ఇప్పటి వరకు 1,00,890 మందికి పరీక్షలు చేసి 20,659 మందికి రీడింగ్ గ్లాసులు అందజేసినట్లు డీఎంహెచ్‌వో వెంకటరమణ తెలిపారు. మరో 11,840 ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కళ్లకు స్క్రీనింగ్ చేసి మందులతో పాటు అద్దాలు ఇస్తుండడంతో ప్రజలు సంబురపడుతున్నారు. సీఎం కేసీఆర్ వల్లే తమ మస్క కళ్లకు కొత్త వెలుగులు వచ్చాయని చెబుతున్నారు.
గిర్మాజీపేట, ఫిబ్రవరి 9 : జిల్లా వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల్లో గురువారం వరకు 1,00,890 మందికి పరీక్షలు నిర్వహించినట్లు డీఎంహెచ్‌వో కాజీపేట వెంకటరమణ తెలిపారు. అందులో 20,659 మందికి రీడింగ్ గ్లాసులు అందజేశామని, మరో 11,840 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసుల కోసం ఆర్డర్ ఇచ్చామన్నారు. వీరిలో 341 మందికి గ్లాసులు అందజేసినట్లు తెలిపారు. ఆర్డర్ చేసిన అద్దాలు వచ్చిన వెంటనే అందరికీ అందజేస్తామన్నారు. జిల్లాలోని 33 గ్రామపంచాయతీలు, 9 వార్డుల్లో కంటివెలుగు పరీక్షలు పూర్తయ్యాయని, 25 జీపీలు, 19 వార్డుల్లో త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 1,00,890 మందికి కంటి పరీక్షలు నిర్వహించామని, అందులో 46,708 మంది పురుషులు, 54,173 మంది స్త్రీలు, ఏడుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారన్నారు. 16,569 ఎస్సీలకు, 7,741 ఎస్టీలకు, 68,809 బీసీలకు, 4,779 ఓసీలకు, 2,970 మైనార్టీలకు పరీక్షలు చేసినట్లు తెలిపారు. 68,050 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని చెప్పారు.
రాయపర్తి : మండలంలోని పెర్కవేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో కంటి వెలుగు శిబిరాన్ని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ చిన్నాల తారాశ్రీ-రాజబాబు, ఎం పీటీసీ బండి అనూష- రాజబాబు, హెల్త్ సూపర్వైజర్ ధరావత్ భీమానాయక్, జీపీ కార్యదర్శ ఆజ్మీరా వెంకటేశ్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర వీరస్వా మి, మహ్మద్ అమ్జద్‌పాషా, బొమ్మెర రమాదేవి, గడ్డం యాకాంతం, గారె కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్ : కంటి వెలుగు కార్యక్రమంలో పరీక్షలకు అనుగుణంగా అద్దాలు అందజేస్తున్నారని 32వ డివిజన్ కార్పొరేటర్ పల్లం పద్మ అన్నారు. గురువారం డివిజన్లోని సెంటర్లో అద్దాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కంటి పరీక్షలు చేసి వారికి తగిన అద్దాలను ప్రత్యేకంగా తయారు చేయించి ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సిబ్బంది పని చేయాలన్నారు.
నర్సంపేట రూరల్ : కంటి వెలుగును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ మోతె కళావతి అన్నారు. గురువారం మండలంలోని ఏనుగల్తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంధత్వ నివారణకు కంటి వెలుగు కార్యక్రమం దోహదపడుతుందన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రికార్డులను, అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీపీ పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ స్వాతి-రవికుమార్, వైద్యాధికారి బానాల అరుణ్‌చంద్ర, కంటి వెలుగు క్యాంప్ ఇన్చార్జి డాక్టర్ కవిత, పంచాయతీ కార్యదర్శి రవిచందర్ తదితరులు పాల్గొన్నారు.
సంగెం : మండలంలోని షాపురం గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ సట్ల రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు, ఆపరేషన్లు కూడా చేస్తారని చెప్పారు. గ్రామస్తులు రెండో విడుత కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో క్యాంపు మెడికల్ ఆఫీసర్ విజయ్‌కుమార్, సూపర్వైజర్ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చెన్నారావుపేట, ఫిబ్రవరి 9 : తండాలో ఉన్న చిన్న బడిలో కళ్ల పరీక్షలు చేస్తున్నారని ఆశ కార్యకర్త చెబితే పోయి చూపించుకున్న. చూపు మందగించిందని కంప్యూటర్‌తో పరీక్షలు చేసి కొత్త అద్దాలు ఇచ్చిండ్లు. అంతకు ముందు కంటే ఇప్పుడు అన్నీ మంచిగ కనబడతానయ్. సర్కారు ఇట్లా కంటి పరీక్షలు చేయించడం మంచిగున్నది. గిట్లాంటి పని నాలాంటి ఎంతో మందికి ఉపయోగపడుతది. వాళ్లు ఇచ్చిన అద్దాలు కూడా మంచిగ ఉన్నయ్.
– ధరంసోత్ సరోజన, ఈర్యాతండా, చెన్నారావుపేట