పోచమ్మమైదాన్, అక్టోబర్ 30: సీఎం కేసీఆర్‌తోనే బంగారు భవిష్యత్ అని, నియోజకవర్గాన్ని అందంగా తీర్చిదిద్దుకున్నామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నియోజకవర్గంలోని 21, 22, 23, 13 డివిజన్లకు చెందిన యువత పెద్ద సంఖ్యలో సోమవారం పోచమ్మమైదాన్‌లో స్వాగతం పలికి, దేశాయిపేట కేఆర్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. డీజే మోతల నడుమ భారీ గజమాలతో సత్కరించి ర్యాలీలో తీసుకవెళ్లారు. ఎమ్మెల్యే సైతం ద్విచక్రవాహనంపై ర్యాలీలో పాల్గొన్నారు. కేఆర్ గార్డెన్లో యూత్ నాయకుడు దిలీప్‌రెడ్డి ఏర్పాటు చేరిన చేరిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన యువతకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 90శాతం నిరుపేదలు ఉన్న ఈ ప్రాంతంలో తాను ఎమ్మెల్యే అయ్యాక గొప్పగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. తనకు ఒకసారి అవకాశం కల్పించగానే నియోజకవర్గంలో జిల్లా కేంద్రం, కలెక్టరేట్, బస్‌స్టేషన్, దేశంలో ఎక్కడా లేనివిధంగా 24అంతస్తులతో రూ.1,250 కోట్లతో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్, అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీ ఏర్పాటు చేసినట్లు వివరించారు. 1945 వేసిన మండిబజార్, చౌరస్తా రోడ్లను సుందరంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. ఇయ్యాల ఎన్నికలు రాగానే ఎక్కడెక్కడి నుంచో నాయకులు వస్తున్నారని, ఎన్నడూ కనిపించని నాయకులు వస్తారు జాగ్రత్త అన్నారు. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ నుంచి పోటీ చేసే నాయకుల్లో ఒకరు వర్ధన్నపేట నుంచి, మరొకరు వంచనగిరి నుంచి వస్తున్నారని, కానీ నేను పక్కా లోకల్ అన్నారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే మరణించేవరకు ఉంటానని పేర్కొన్నారు. కరోనా సమయంలో, వరదలు వచ్చినప్పుడు ప్రజల వెంట ఉన్నానని చెప్పారు. ఉద్యోగావకాశాల కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశానని, బతుకమ్మ, దసరా ఉత్సవాలను ఎన్నికల కోడ్ వల్ల ఏర్పాట్లకు ఇబ్బందులు కలిగితే తన తండ్రి ఎన్ఎన్ ట్రస్ట్ ద్వారా వారికి సాయం చేసినట్లు వివరించారు. పార్టీ డివిజన్ ఇన్చార్జి మావురపు విజయభాస్కర్‌రెడ్డి, కార్పొరేటర్ సురేష్‌కుమార్ జోషి పాల్గొన్నారు.
వరంగల్ ఎల్బీ నగర్‌లోని కాస్మో ఫంక్షన్ హాల్లో మైనారిటీ మత పెద్దలు, ముఖ్యనాయకులతో ఆదివారం రాత్రి సమావేశం నిర్వహించారు. హాజరైన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి కల్పన అవకాశాలు రావాలే తప్ప, కత్తులు, కటార్లు కావని అన్నారు. ఓటు విలువను పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇప్పటికే తూర్పు నియోజకవర్గం మంచి విజన్ ప్రణాళికతో అభివృద్ధి కొనసాగుతుందని వివరించారు. కార్పొరేటర్ ఎండీ ఫుర్ఖాన్, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, మైనారిటీ మత పెద్దలు పాల్గొన్నారు.
గిర్మాజీపేట: నగరంలోని 33వ డివిజన్ పెరుకవాడలో సోమవారం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హాజరై మాట్లాడారు. మీ మధ్య పుట్టి పెరిగిన బిడ్డనని, మీ ఆశీర్వాదమే బలం, ప్రజా సేవ చేయడమే అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో రూ. 4,100కోట్లతో నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఎన్నికల్లో మీ ఆశీర్వాదం నాపై ఇలానే చూపి కారు గుర్తుకే ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముష్కమల్ల అరుణ, బీఆర్ఎస్ నేత ముష్కమల్ల సుధాకర్, ఇన్చార్జి వడ్డె కోటేశ్వర్, డివిజన్ అధ్యక్షులు మీరిపెల్లి వినయ్‌కుమార్, కార్యకర్తలు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు.